న్యూఢిల్లీ: గత ఏడాది రిపబ్లిక్ దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని ఎర్రకోట వద్ద జరిగిన హింసాకాండ ఘటనలో వార్తల్లో వ్యక్తిగా నిలిచిన పంజాబీ సినీ నటుడు దీప్ సిద్ధూ మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. కుండ్లి మనేసార్ పల్వాల్ ఎక్స్‌ప్రెస్ హైవేపై ఈ ప్రమాదం జరిగింది. సిద్ధూ ఢిల్లీనుంచి పంజాబ్‌లోని భటిండాకు వెళ్తుండగా ఆయన ప్రయాణిస్తున్న కారు ఆగిఉన్న ట్రైలర్ ట్రక్కును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సిద్ధూనుదగ్గర్లోని ఆస్పత్రికి తరలించగా ఆయన అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు. వాహనంలో ఉన్న ఓ మహిళ ప్రాణాలతో బైటపడినట్లు సమాచారం. గత ఏడాది ఢిల్లీలో రిపబ్లిక్ దినోత్సవం రోజు జరిగిన హింసాకాండతో సంబంధం ఉందన్న ఆరోపణలు రావడంతో ఆయన వార్తల పతాక శీర్షికలకెక్కారు. వివాదాస్పద సాగు చట్టాలకు వ్యతిరేకంగా ందోళన చేస్తున్న రైతులు నిర్వహించిన ట్రాక్టర్ల ర్యాలీ ఒక్క సారిగా హింసాత్మకంగా మారడంతో పలువురు గాయపడ్డారు. ఈ సంఘటనకు సంబంధించి ఢిల్లీ పోలీసులు సిద్ధూపై 3,224 పేజిల చార్జిషీట్ దాఖలు చేశారు. సిద్ధూకు పంజాబ్‌లో పెద్ద సంఖ్యలో అభిమానులున్నారు.