Saturday, November 23, 2024

కిషన్‌రెడ్డి ‘పిట్ట కథలు’

- Advertisement -
- Advertisement -

Minister Harish rao fires on Kishanreddy

మంత్రి హరీశ్‌రావు నిప్పులు

అమరవీరుల స్థూపాన్ని తాకే హక్కు ఆయనకు ఉందా?

తెలంగాణ ఉద్యమంలో ఎంఎల్‌ఎ పదవికి రాజీనామా చేయమంటే తప్పించుకొని పారిపోయిన కిషన్‌రెడ్డి ఇప్పుడు పిట్టకథలు చెబుతున్నారు ఆంధ్ర ఉద్యమానికి నాయకత్వం వహిస్తానన్న ఆయనకు అమరుల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు కేంద్రమంత్రిగా రాష్ట్రానికి ఆయన ఏం తీసుకొచ్చారు? మేడారం జాతరకు రాష్ట్ర ప్రభుత్వం రూ.364కోట్లు ఇస్తే కేంద్రం ఇచ్చింది రూ.2.5కోట్లు మాత్రమే తెలంగాణకు కిషన్‌రెడ్డి గుండు సున్నాగా మిగిలారు : రాష్ట్రానికి కేంద్ర నిధులపై అమరవీరుల స్థూపం వద్ద చర్చకు రావాలని సిఎం కెసిఆర్‌కు కిషన్‌రెడ్డి సవాల్‌పై మండిపడ్డ మంత్రి

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిన నిధులపై అమరవీరుల స్థూపం దగ్గర చర్చకు రావాలని ముఖ్యమంత్రి కెసిఆర్‌ను కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి సవాల్ విసరడంపై మంత్రి హరీశ్‌రావు ఘాటుగా స్పందించారు. అసలు అమరవీరుల స్థూపాన్ని తాకే హక్కు ఆయనకు ఉందా? అని ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమంలో ఎంఎల్‌ఎ పదవికి రాజీనామా చేయమంటే తప్పించుకుని పారిపోయిన కిషన్‌రెడ్డి…ఇప్పుడు పిట్ట కథలు చెబుతున్నారని మండిపడ్డారు. జై ఆంధ్రా ఉద్యమానికి నాయకత్వం వహిస్తానని ప్రకటించిన ఆయన అమరుల గురించి మాట్లాడే నైతికత లేదన్నారు. మంగళవారం తెలంగాణ భవన్‌లో మంత్రిమహమూద్ అలీ, ఎంఎల్‌ఎలు భేతి సుభాష్ రెడ్డి, కాలేరు వెంకటేష్, ఆళ్ల వెంకటేశ్వర్ రెడ్డి మాజీ ఎంపీ సీతారాం నాయక్ తదితరులతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ.. కిషన్‌రెడ్డిపై నిప్పులు కురిపించారు.

బిజెపి నాయకులు అమరుల గురించి మాట్లాడి…వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పైగా కేంద్రమంత్రిగా కొనసాగుతున్న ఆయన రాష్ట్రానికి ఒక్క రూపాయి అయినా తీసుకొచ్చారా? అని నిలదీశారు. హైదరాబాద్‌కు వరదలు వస్తే కేంద్రమంత్రిగా నిధులేమైనా ఇప్పించారా? లేక రాష్ట్రానికి ఒక్క ట్రిపుల్ ఐటిని తీసుకొచ్చారా? అని హరీశ్‌రావు ప్రశ్నించారు. కనీసం రాష్ట్రానికి ఒక్క ప్రాజెక్టు అయినా తెచ్చారా? అని అడిగారు. మేడారం జాతరకు రాష్ట్ర ప్రభుత్వం రూ.364 కోట్లు కేటాయిస్తే… కేంద్రం ఇచ్చింది కేవలం రూ.2.5 కోట్లు మాత్రమేనని ఎద్దేవా చేశారు. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఎఫ్‌సిఐకి రూ.65 వేల కోట్లు కోత పెట్టారని, అలాగే ఉపాధి హామీకి రూ.25 వేల కోట్లు తగ్గించారన్నారు. వీటన్నింటిపై ముందుగా కిషన్‌రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

గుండుసున్నాగా మిగిలారు

తెలంగాణకు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి గుండుసున్నాగా మిగిలారని మంత్రి హరీశ్‌రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం రాష్ట్ర పండగ గా నదుల అనుసంధానంతో రాష్ట్రం సస్యశ్యామలం అవుతుందని కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించడంపై మండిపడ్డారు. అసలు కిషన్‌రెడ్డి అసలు తెలంగాణ బిడ్డనేనా? అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రాజెక్టులకు క్లియరెన్స్ ఇవ్వకుండా వేరే రాష్ట్రాల నీటి ప్రయోజనాల కోసం మాట్లాడం సిగ్గుచేటన్నారు. ఎన్‌డియే హాయంలో మూడు రాష్ట్రాల ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇస్తే… రాష్ట్రంలోని కాళేశ్వరం, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులకు జాతీయ హోదా ఎందుకు తీసుకురాలేకపోయారని నిలదీశారు.విద్యుత్ సంస్కరణలకు ఆర్థిక సాయానికి కేంద్రం మెలిక పెట్టింది నిజం కాదా? విద్యుత్ సంస్కరణలు చేస్తేనే ఎఫ్‌ఆర్‌బిఎం కింద 0.5 శాతం అప్పుకు వెసలు బాటు ఇస్తామని కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి సీతారామన్ బడ్జెట్ లో చెప్పలేదా? ఈ షరతును కిషన్ రెడ్డి తీయించగలరా? అని ప్రశ్నించారు.

రైతుల ప్రయోజనాలు ఫణంగా పెట్టడానికి సిఎం కెసిఆర్ ఒప్పుకోలేదన్నారు. దీని వల్ల రాష్ట్రంపై రూ. 5 వేల కోట్ల నష్టం వచ్చినా పర్వాలేదు కానీ రైతులకు నష్టం చేయమని మీటర్లకు ఒప్పుకోలేదన్నారు. అభివృద్ధి గురించి మాట్లాడమంటే బిజెపి నాయకులు పాకిస్తాన్ పాచిక వేస్తారని ఎద్దేవా చేశారు. ఇప్పుడు ఆ పాచిక కూడా పని చేయడం లేదు… పాచి పోయిందన్నారు. పాకిస్థాన్ వెళ్లి ఎవరి బిర్యానీ తిన్నారో కిషన్ రెడ్డి చెప్పాలని డిమాండ్ చేశారు. కేంద్రం నుంచి బకాయిలు తెస్తే మంచిదని… బుకాయింపులు కాదన్నారు. కనీసం సమ్మక్క సారాలమ్మ జాతరను కూడా జాతీయ పండుగగా గుర్తించరా? అని ప్రశ్నించారు. దేశంలో ఏడేండ్లలో కొత్తగా 7 ఐఐఎంలు, 7ఐఐటిలు, ట్రిపుల్ ఐటీలు దేశవ్యాప్తంగా 16 ఏర్పాటు చేస్తే రాష్ట్రానికి ఇచ్చింది కూడా ఒకటి కూడా లేదన్నారు. ఎన్‌ఐడిలు దేశంలో నాలుగు పెడితే.. రాష్ట్రానికి ఇచ్చినవి సున్నా అని మంత్రి హరీశ్‌రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

కెసిఆర్ భాషను ప్రశ్నించే స్థాయి కిషన్‌రెడ్డికి లేదు

కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి కెసిఆర్ గురించి, ఆయన మాట్లాడే భాషపై మాట్లాడే అర్హత లేదని మంత్రి హరీశ్‌రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజల వాడుక భాషనే కెసిఆర్ మాట్లాడతారన్నారు. మీలాగా మతాల మధ్య చిచ్చుపెట్టే భాష కాదన్నారు. కెసిఆర్ ప్రశ్నలకు దమ్ముంటే సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఎస్‌టి, మైనారిటీ రిజర్వేషన్ పెంచాలని దానికి కోసం రాజ్యాంగం మార్చాలనడం కెసిఆర్ తప్పా? అని ప్రశ్నించారు. జాతీయ ప్రాజెక్టు, ఐఐఎం, ఐఐటి ఇవ్వమని కేంద్రాన్ని కిషన్ రెడ్డి ఎందుకు అడగడం లేదని మంత్రి హరీశ్రావు నిలదీశారు.

కిషన్‌రెడ్డిది సిఎం కెసిఆర్‌ను ప్రశ్నించే స్థాయి కాదన్నారు. ఆయనతో చర్చలు టిఆర్‌ఎస్ శాసనసభ్యులు చాలన్నారు. పార్లమెంట్‌లో రాష్ట్ర విభజన బిల్లు ఆమోదం పొందనిప్పుడు అమిత్ షా లో తెలంగాణ ఏర్పాటు ను బ్లాక్‌డేగా అభివర్ణిస్తే ….కిషన్ రెడ్డి బల్లలు చరిచారన్నారు. మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడక పోతే ఆయనకు కేంద్ర మంత్రి పదవి వచ్చేదా? అని ప్రశ్నించారు. కేంద్ర మంత్రిగా ఉంటూ కిషన్‌రెడ్డికి రాష్ట్రానికి ఏమీ తెచ్చారో చెప్పాలని ఇప్పటికే అనేక సార్లు డిమాండ్ చేస్తే…ఏ ఒక్క దానికి సమాధానం రాలేదని మండిపడ్డారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News