అది ఇష్టం, సౌర విద్యుత్ కొని తీరాలని బలవంతం చేయడం లేదు
సిఎం కెసిఆర్ విమర్శలతో వెనక్కి తగ్గిన కేంద్రం
వివరణ ఇచ్చిన కేంద్రమంత్రి ఆర్.కె.సింగ్
మనతెలంగాణ/ హైదరాబాద్ : విద్యుత్ సంస్కరణలపేరుతో రైతుల వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు మీటర్ల ఏర్పాటు అప్రజాస్వామిక విధానం అని ముఖ్యమంత్రి కెసిఆర్ చేసిన విమర్శలకు కేంద్ర ప్రభుత్వం వెనక్కు తగ్గింది. మంగళవారం నాడు కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్.కె.సింగ్ స్పందించారు. విద్యుత్ సంస్కరణలపై కేంద్ర మత్రిత్వశాఖ ప్రకటన విడుదల చేసి సిఎం కెసిఆర్ చేసిన విమర్శలకు కేంద్ర మంత్రి సుదీర్ఘ వివరణ ఇచ్చుకున్నారు. సౌరవిద్యుత్ కొనుగోలుకు ఏ రాష్ట్రాన్ని బలవంతం చేయట్లేదని కేంద్ర మంత్రి ప్రకటనలో వివరించారు. ఓపెన్ బిడ్‌ల ద్వారానే కొనుగోలు ప్రక్రియ నిర్వహిస్తున్నట్టు తెలిపారు. విద్యుత్ కనెక్షన్లు కచ్చితంగా ఇవ్వాలని రాష్ట్రాలను బలవంతం చేయమని కేంద్రం స్పష్టతనిచ్చింది. సోలార్ ఎనర్జీ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా కూడా ఎప్పటికప్పుడు పునరుత్పాద ఇంధనం కోసం ఒపెన్ బిడ్లు నిర్వహిస్తోంది. ఈ బిడ్‌లతో అనేక కంపెనీలు పోటీ పడుతున్నాయి. తక్కువ టారీఫ్‌ను అందించే కంపెనీలు ఓపెన్ బిడ్ ద్వారా పారదర్శకంగా ఎంపిక చేయబడతాయి . అ బిడ్ నుంచి విద్యుత్ కొనుగోలు చేయాలనుకునే రాష్ట్రాలు తమ అవసరకానికి అనుగునంగా వ్యవహరిస్తాయి.
బిడ్‌లలో ఖరారు చేసిన ధరలకు విద్యుత్‌ను కొనుగోలు చేయాలా వద్దా అనేది పూర్తిగా రాష్ట్రాల నిర్ణయం అని , వారు తమ సొంత బిడ్‌లను ఎంచుకోవచ్చని కేంద్రం ఈ మేరకు ప్రకటనలో స్పష్టం చేసింది. రైతుల వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు మీటర్లు ఏర్పాటు చేయాలని రాష్ట్రాలపై కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకురావటం లేదని స్పష్టం చేసింది. విద్యుత్ సంస్కరణలపై కేంద్రం ముసాయిదా బిల్లు తెచ్చిందని ఇటీవల సిఎం కేసిఆర్ కేంద్ర ప్రభుత్వంపై మండి పడ్డారు.వ్యవసాయ రంగానికి కొత్త విద్యుత్ కనెక్షన్లు ఇవ్వకూడనేది కేంద్ర ప్రభుత్వ విధానంగా ఉందని ఆరోపించారు. వంద శాతం మీటర్ రీడింగ్‌పై డిస్కంలు చర్యలు తీసుకోవాలని తెలిపారు. ముసాయిదా బిల్లును వివిధ రాష్ట్రాలకు పంపించారని వివరించారు. బిల్లుపై కొన్ని రాష్ట్రాల సిఎంలు తమ అభిప్రాయాలు కూడా తెలిపారన్నారు. బిల్లు ఆమోదానికి ముందే రాజ్యాంగాన్ని ఉల్లంఘించారని పేర్కొన్నారు. విద్యుత్ సంస్కరణలను వ్యతిరేకిస్తూ తెలంగాణ రాష్ట్ర శాసనసభలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించినట్టు వివరించారు. విద్యుత్ సంస్కరణల నెపంతో రైతుల జోలికి వస్తే ఊరుకునేది లేదని సిఎం కెసిఆర్ చేసిన ప్రకటనపై కేంద్ర ప్రభుత్వం ఈ వివరణ ఇచ్చుకుంది.