Tuesday, December 24, 2024

దేశానికి కొత్త అభివృద్ధి నమూన ‘కెసిఆర్‌’..

- Advertisement -
- Advertisement -

Jagadish Reddy launches book on CM KCR

హైదరాబాద్: పాలనారంగంలో దేశంలోనే బలమైన ముద్రవేసిన పాలనాదక్షుడు, జనహృదయంలో చోటు సంపాదించిన జననేత కేసీఆర్‌ అని రాష్ట్ర విద్యుత్‌ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి అన్నారు. కేసీఆర్‌ పాలనా, సంస్కరణలు రాష్ట్ర అభివృద్ధి గురించి దేశవ్యాపితంగా చర్చ జరుగుతుందని, ఆయన ఆలోచనల ధారల్లో దేశానికే నూతన ప్రణాళిక రచించుకునే సమయం అసన్నమైందని అన్నారు. సిఎం కెసిఆర్‌ జన్మదినోత్సవం సందర్భంగా తెలంగాణ సాహిత్య అకాడమి చైర్మన్‌ జూలూరు గౌరీశంకర్‌ రాసిన “కెసిఆర్‌ ది మ్యాన్‌ ఆఫ్‌ మిలియన్స్‌” అన్న పుస్తకాన్ని బుధవారం మినిస్టర్‌ క్వార్టర్స్‌లో మంత్రి జగదీష్‌రెడ్డి ఆవిష్కరించారు. దేశంలో కొత్త అభివృద్ధి నమూనా తీసుకురావాలని గత 60ఏళ్ల పాలనకు భిన్నంగా అభివృద్ధి నమూనా భారత్‌ను నిర్మించే లక్ష్యంతో కేసీఆర్‌ ముందుకు సాగుతున్న సమయంలో ఈ పుస్తకం రావటం అభినందనీయమన్నారు. ఇది ఉద్యమకారులకు దారిదీపం లాంటిదని చెప్పారు. దేశంలో అపరిష్కృత సమస్యలకు కేసీఆర్‌ కొత్త అజెండా రచిస్తున్న సందర్భంలో పాలనాదక్షుడైన కేసీఆర్‌ సమర్థతను చాటి చెప్పటానికి ఈ పుస్తకం ఉపయోగపడుతుందని మంత్రి పేర్కొన్నారు. ఉద్యమ సమయంలో లక్షలాది మందిలో లక్షల ఆలోచనలను కేసీఆర్‌ ఏ విధంగా రేకెత్తించగలిగారో వాటినన్నింటిని గౌరీశంకర్‌ ఈ పుస్తకంలో పొందుపరిచారని చెప్పారు. అంతర్జాతీయ కవులు, రచయితలు ఈ పుస్తకానికి ముందుమాటలు రాయటం వల్ల తెలంగాణ ఉద్యమ చరిత్ర ప్రపంచవ్యాప్త అస్తిత్వ ఉద్యమాలకు పాఠంగా ఉంటుందని తెలిపారు. తెలంగాణలో ఏం జరిగింది? రాష్ట్ర సాధన ఉద్యమం ఎట్లా కొనసాగింది? ఎన్నెన్ని ఆటుపోట్లను ఎదుర్కోవలసి వచ్చింది? చిక్కుముడులను విప్పుకుంటూ రాష్ట్ర సాధన ఉద్యమ లక్ష్యాలను ఎట్లా చేరుకోగలిగారో ఈ పుస్తకంలో లిఖించటం జరిగిందని వివరించారు. తెలుగులో జూలూరు గౌరీశంకర్‌ రాసిన “దటీజ్‌ కేసీఆర్‌” పుస్తకాన్ని ఆంగ్ల అనువాదకుడు మంతెన దామోదరాచారి “కేసీఆర్‌ ది మ్యాన్‌ ఆఫ్‌ మిలియన్స్‌” పేరుతో ఆంగ్లంలోకి అద్భుతంగా అనువదించారని మంత్రి తెలిపారు.

Jagadish Reddy launches book on CM KCR

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News