మహబూబ్ నగర్: మన్యంకొండను మరో తిరుపతిగా అభివృద్ధి చేస్తామని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు, సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మన్యంకొండ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా బుధవారం ఆయన పద్మావతి అమ్మవారి దేవాలయం సమీపంలో 25 లక్షల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేసిన శ్రీవారి వనాన్ని ప్రారంభించారు. అంతేకాక మన్యంకొండ కొండపై స్వామి వారి ఉచిత అన్నదాన కేంద్రాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మన్యంకొండ అభివృద్ధికి అనేక కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. పేదల తిరుపతిగా, తెలంగాణ తిరుపతిగా పేరుగాంచిన మన్యం కొండకు వచ్చే భక్తుల సంఖ్య పెరుగుతుండడాన్ని దృష్టిలో ఉంచుకొని 18 వసతి గదుల నిర్మాణం చేపట్టడం జరిగిందని, ఇవి త్వరలోనే పూర్తి కానున్నాయని తెలిపారు. అదేవిధంగా ఏసి కళ్యాణమండపం, పద్మావతి అమ్మవారి దేవాలయం వద్ద భక్తుల సౌకర్యార్థం షెడ్ల నిర్మాణం వంటివి చేపట్టామని, ఇటీవల పక్కనే స్వయంభు లక్ష్మీ నరసింహస్వామి దేవాలయాన్ని కూడా పునః ప్రతిష్టించడం జరిగిందన్నారు.
మన్యంకొండ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులకు అసౌకర్యం కలగకుండా జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. ముఖ్యంగా కోనేటిలో స్నానానికి తగినంత నీటిని ఏర్పాటు చేయాలని, భక్తులు జల్లు స్నానం చేసేందుకు సరిపడా నీరు వచ్చేలా చూడాలని, భక్తులు కోనేట్లో మునిగి స్నానం చేసేలా నీటి వసతి కల్పించాలని చెప్పారు. అదేవిధంగా కొండపైకి నడిచి వచ్చే నడకదారి భక్తులకు తాగునీరు, టాయిలెట్లు, ఇతర సౌకర్యాలను కల్పించాలని అన్నారు. కొండపై నుండి వచ్చే వృధా నీటిని పైపుల ద్వారా మళ్లించి ఉద్యాన తోటకు మళ్ళించే ఏర్పాటు చేయాలని, అదేవిధంగా భక్తులకు సూచనలు, సలహాలు ఇచ్చే విధంగా సైన్ బోర్డులు ఏర్పాటు వంటివి చేయాలని మంత్రి చెప్పారు.
Srinivas Goud begins free food at Manyamkonda