యుపి ఓటర్లకు రైతు సంఘాల నేతల విజ్ఞప్తి
లఖింపుర్ : రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని, అందుకే ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపిని శిక్షించాల్సిందేనని సంయుక్త కిసాన్ మోర్చా నేతలు లఖింపుర్‌లో ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. రైతులపై కారు దాడి ఘటనలో ప్రధాన నిందితుడు ఆశిష్ మిశ్రాకు బెయిల్ లభించడంపై స్పందించిన రైతు నేతలు,ఐదుగురిని పొట్టన బెట్టుకున్న వ్యక్తికి మూడు నెలల్లోనే బెయిల్ రావడంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. లఖింపుర్‌లో రైతు నేతలు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. పంటలకు కనీస మద్దతుధరతోపాటు రైతులకు ఎన్నోహామీలను కేంద్ర ప్రభుత్వం ఇచ్చినా ఇప్పటికీ అమలు చేయలేదని ఎస్‌కెఎం నేత శివకుమార్ శర్మ విమర్శించారు.
ఉద్యమ సమయంలో నిరసన కారులపై పెట్టిన కేసులను వెనక్కు తీసుకోవడం, అలాగే ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించడం లోను ఇప్పటికీ ముందడుగు పడలేదన్నారు. ఆ సమస్యలపై కమిటీ వేస్తామంటూ స్వయంగా ప్రధానియే ప్రకటించినా, నేటికీ అలా జరగలేదని గుర్తు చేశారు. అయితే ఈ ఎన్నికల్లో ఎవరికి ఓటు వేయాలో మేం చెప్పడం లేదని, కానీ బిజెపిని మాత్రం శిక్షించాల్సిందేనని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. యూపీలో మొత్తం ఏడు దశల్లో ఎన్నికలు జరుగనుండగా, లఖింపుర్ ఖేరీలో ఫిబ్రవరి 23న నాలుగోదశ పోలింగ్ జరగనుంది.