కోల్‌కతా: రానున్న ఐపిఎల్ సీజన్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ (కెకెఆర్) కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్‌ను నియమించారు. ఈ విషయాన్ని జట్టు యాజమాన్యం బుధవారం అధికారికంగా ప్రకటించింది. ఇటీవల జరిగిన ఐపిఎల్ మెగా వేలం పాటలో కోల్‌కతా రూ.12.25 కోట్లను వెచ్చించి శ్రేయస్‌ను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఇక గతంలో ఢిల్లీ క్యాపిటల్స్‌కు కూడా అయ్యర్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని కెకెఆర్ యాజమాన్యం అతన్ని తమ జట్టు కెప్టెన్‌గా నియమించింది. కాగా అయ్యర్ టీమిండియాలో కీలక ఆటగాడిగా ఎదిగాడు. ఇక వేలం పాటలో అతన్ని దక్కించుకునేందుకు పలు ఫ్రాంచైజీలు పోటీ పడ్డాయి.
దీనిలో పైచేయి సాధించిన కోల్‌కతా అయ్యర్‌ను సొంతం చేసుకుంది. ఐపిఎల్‌లో వరుస వైఫల్యాలతో సతమతమవుతున్న ఢిల్లీ టీమ్‌ను గాడిలో పెట్టిన ఘనత అయ్యర్‌కు దక్కుతోంది. అతని సారథ్యంలో ఢిల్లీ ఐపిఎల్‌లో నిలకడైన ఆటను కనబరిచింది. కిందటి సీజన్‌లో అయ్యర్ గాయపడడంతో రిషబ్ పంత్‌ను ఢిల్లీ కెప్టెన్‌గా నియమించారు. అంతేగాక ఢిల్లీ యాజమాన్యం కూడా అయ్యర్‌ను రిటెయిన్ చేసుకోలేదు. దీంతో శ్రేయస్ వేలం పాటకు వెళ్లాడు. మెగా వేలంలో కోల్‌కతా అతన్ని భారీ మొత్తానికి దక్కించుకుంది. తాజాగా అయ్యర్‌కు సారథ్య బాధ్యతలు కూడా అప్పగించింది.