చండీగఢ్ : మోడీ, కేజ్రీవాల్ ఇద్దరూ ఆర్‌ఎస్‌ఎస్ నుంచి ఎదిగివచ్చినవారేనని వారిద్దరూ బడేమియా, చోటేమియాగా పేర్కొంటూ పఠాన్‌కోట్‌లో గురువారం జరిగిన ర్యాలీలో కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ విమర్శలు గుప్పించారు. గుజరాత్ మోడల్‌లో మనం చూసింది ఒక్కటేనని, దేశాన్ని ఇద్దరు వ్యక్తులకు వారు అమ్మేశారని విరుచుకుపడ్డారు. ఇక ఢిల్లీ మోడల్‌ను ఉద్దేశిస్తూ అక్కడి రోడ్లపై ప్రజలు ఎలా ప్రాణాలు కోల్పోతున్నారో మీరు చూశారా అని ప్రశ్నించారు.
పేద కుటుంబం నేపథ్యం కలిగిన సీఎం చరణ్‌జిత్ సింగ్ చన్నీ పంజాబీల బాగు కోసం సరైన నిర్ణయాలు తీసుకోగలుగుతారని వివరించారు. 111 రోజులుగా పంజాబ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు మేలు చేసే నిర్ణయాలు తీసుకోగలిగిందని, సగటు పంజాబ్ ప్రజలకు ప్రాతినిధ్యం వహించేలా చన్నీ పేద కుటుంబం నుంచి రావడమే దీనికి కారణమని ఆమె చెప్పుకొచ్చారు. గుజరాత్ మోడల్‌ను పరిశీలిస్తే ఏ ఒక్కరికి ఉద్యోగాలు అందుబాటులో ఉండవని, వ్యాపారాలు సజావుగా సాగవనీ, ఎలాంటి నిధులూ సమకూరవని తెలుస్తుందని చెప్పారు. ఇక ఢిల్లీ మోడల్‌లో ఏ ఒక్క ఆస్పత్రి , విద్యాసంస్థలను కొత్తగా నిర్మించలేదని ఎద్దేవా చేశారు.