బిజెపి మణిపూర్ ఎన్నికల మేనిఫెస్టో
ఇంఫాల్: మణిపూర్‌లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల కోసం బిజెపి తన మేనిఫెస్టోను గురువారం విడుదల చేసింది. తాము మరోసారి అధికారంలోకి వస్తే ప్రతిభావంతులైన కళాశాల విద్యార్థినులకు ద్విచక్రవాహనాలు అందచేస్తామని, సీనియర్ సిటిజన్లకు ప్రస్తుతం నెలకు రూ. 200 చొప్పున ఇస్తున్న పింఛన్లను రూ. 1,000కి పెంచుతామని, రూ. 100 కోట్లతో స్టార్టప్ నిధి ఏర్పాటు చేస్తామని బిజెపి తన మేనిఫెస్టోలో వాగ్దానం చేసింది. బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా మేనిఫెస్టోను విడుదల చేస్తూ ముఖ్యమంత్రి ఎన్ బీరేన్ సింగ్ నాయకత్వంలో రాష్ట్రం గత ఐదేళ్లుగా ప్రగతి పథంలో దూసుకెళ్తోందని, డ్రగ్స్ బెడదను సమర్థవంతంగా కట్టడి చేయడంతోపాటు శాంతి భద్రతలను నియంత్రించిందని చెప్పారు. రాష్ట్రంలో మహిళా సాధికారతను సాధించేందుకు ప్రతిభావంతులైన కళాశాల విద్యార్థినులకు ఉచితంగా స్కూటీలు అందచేస్తామని ఆయన హామీ ఇచ్చారు. తమ పార్టీ మరోసారి అధికారంలోకి వస్తే రాణి గైడిన్‌లియు నూపి మహీరోయ్ సింగి పథకం కింద ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన బాలికలకు రూ. 25,000 అందచేస్తామని కూడా ఆయన వాగ్దానం చేశారు.