75 మందిని పట్టుకున్న షీటీమ్స్
42 మంది మేజర్లు, 33 మంది మైనర్లు
సిపి క్యాంప్ కార్యాలయంలో కౌన్సెలింగ్ నిర్వహించిన భూమిక స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు
మనతెలంగాణ, సిటిబ్యూరోః యువతులు, బాలికలు, మహిళలను వేదిస్తున్న పోకిరీలపై రాచకొండ పోలీస్ కమిషనర్ షీటీమ్స్ పోలీసులు 57 కేసులు నమోదు చేశారు. ఇందులో 16 మందిపై ఎఫ్‌ఐఆర్‌లు, 27 మందిపై పెట్టి కేసులు, 14 మందిపై కౌన్సెలింగ్ ఇచ్చారు. కుటుంబ సభ్యుల సమక్షంలో పోకిరీలకు పోకిరీలకు భూమిక ఉమెన్ కలెక్టివ్ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు కౌన్సెలింగ్ రాచకొండ సిపి క్యాంప్ కార్యాలయంలో నిర్వహించారు. సైక్రియాటిస్ట్ డాక్టర్ వాసవి వారికి కౌన్సెలింగ్ నిర్వహించి వారిలో మార్పు తీసుకువచ్చేందుకు ప్రయత్నించారు. రాచకొండ పోలీసులు వాట్సాప్, ఎస్‌ఎంఎస్ ద్వారా ఫిర్యాదులు వచ్చినా స్పందించి బాధితులను కాపాడారు. మెట్రోట్రైన్, జంక్షన్లు, బస్‌స్టాప్‌లు, వర్కింగ్ ప్లేస్‌ల్లో బాలికలు, యువతులు, మహిళలను వేధిస్తున్న పోకిరీలను అదుపులోకి తీసుకున్నారు.
యువతులతో అసభ్య ప్రవర్తన…
విధులు ముగించుకుని ఇంటికి వస్తున్న బాధితురాలితో అసభ్యంగా ప్రవర్తించిన నిందితుడిని వనస్థలిపురం పోలీసులు అరెస్టు చేశారు. వనస్థలిపురానికి చెందిన బాధితురాలు(32) ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తోంది. వనస్థలిపురానికి చెందిన బట్టు నాగరాజు ప్లంబర్ పనిచేస్తున్నాడు. గత ఏడాది డిసెంబర్ 26వ తేదీన విధులు ముగించుకుని బాధితురాలు ఇంటికి వస్తుండగా నాగరాజు ఎదురుగా వచ్చి ప్యాంట్ జిప్‌ను ఓపెన్ చేసి తన ప్రైవేట్ పార్ట్ చూపించి అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో బాధితురాలు వనస్థలిపురం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. కర్నాటక రాష్ట్రం, మంగళూరుకు చెందిన యువతి(20) తన బంధువుల ఇంట్లో ఫంక్షన్‌కు హాజరయ్యేందుకు వనస్థలిపురానికి డిసెంబర్ 30వ తేదీన వచ్చింది. బంధువుల ఇంటికి వెళ్తుండగా బైక్‌పై వచ్చిన భట్టు నాగరాజు వెనుక చేతితో కొట్టాడు. తర్వాత అక్కడి నుంచి స్కూటీపై పారిపోయాడు. రెండు కేసుల్లో నిందితుడిగా ఉన్న నాగరాజును వనస్థలిపురం పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
డెకాయ్ ఆపరేషన్లు…
షీటీమ్స్ చౌటుప్పల్‌లో డెకాయ్ ఆపరేషన్ నిర్వహించి మైనర్ బాలురను అదుపులోకి తీసుకున్నారు. వారికి తల్లిదండ్రుల సమక్షకంలో కౌన్సెలింగ్ నిర్వహించారు. ఇబ్రహింపట్నంలో డెకాయ్ ఆపరేషన్ నిర్వహించి ఐదుగురు మైనర్లును అదుపులోకి తీసుకున్నారు. కుషాయిగూడలో ఈ నెల 24వ తేదీన నిర్వహించిన ఆపరేషన్‌లో బాలికలకు వేధింపులకు గురిచేస్తున్న ముగ్గురు బాలురను అదుపులోకి తీసుకున్నారు. ఎల్‌బి నగర్, షీటీమ్స్ పోలీసులు మన్సురాబాద్ ఎక్స్ రోడ్డు, ఎల్‌బి నగర్ సమీపంలో ఈ నెల 24వ తేదీన నిర్వహించిన ఆపరేషన్‌లో బాలికలను వేధింపులకు గురిచేస్తున్న నలుగురు మైనర్లను అదుపులోకి తీసుకున్నారు. మల్కాజ్‌గిరి టీము నిర్వహించిన డెకాయ్ ఆపరేషన్‌లో పదిమంది మైనర్లను అదుపులోకి తీసుకున్నారు. కాలేజీ పరిసరాల్లో తిరుగుతూ యువతులు, బాలికలను వేధింపులకు గురిచేస్తున్నారు. వనస్థలిపురం పోలీసులు డెకాయ్ ఆపరేషన్ నిర్వహించారు. బాలికలను వేధింపులకు గురిచేస్తున్న ఆరుగురు మైనర్లను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. మెట్రో రైలులో లేడీస్ కంపార్ట్‌మెంట్లలో ప్రయాణిస్తున్న 12మందిని అరెస్టు చేశారు.
బాల్యవివాహాలను ఆపిన పోలీసులు…
బాల్య వివాహాలు చేయడం నేరమని ఎంతగా ప్రచారం చేస్తున్న సమాజంలో కొందరు మారడంలేదు. బాల్య వివాహాలు చేస్తున్న వారిని రాచకొండ షీటీమ్స్ ఆపివేశారు. 12మంది మైనర్ బాలికల వివాహాలను ఆపివేశారు. చౌటుప్పల్, భువనగిరి, ఎల్‌బి నగర్, ఇబ్రహిపట్నం షీటీమ్స్ బాల్య వివాహాలు ఆపివేశారు. ఇప్పటి వరకు రాచకొండ షీటీమ్స్ పోలీసులు 133 బాల్య వివాహాలను ఆపివేశారు. బాలికలను పునరావాస కేంద్రానికి తరలించారు.
షీ పెట్రోలింగ్….
రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో కొత్తగా షీ పెట్రోలింగ్‌ను ప్రారంభించింది. ఓఆర్‌ఆర్, మేయిన్ రోడ్డు, జాతీయ రహదారులు, టోల్‌ప్లాజా, నేరాలు జరిగే ప్రాంతాల్లో షీటీమ్స్ పెట్రోలింగ్ నిర్వహించనున్నారు. ఆపదలో ఉన్న వారు రాచకొండ కంట్రోల్ రూమ్ నంబర్ 9490617111 లేదా డయల్ 100కు ఫోన్ చేయవచ్చని రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ తెలిపారు.