Sunday, November 24, 2024

పంజాబ్‌లో 63% పోలింగ్.. ప్రశాంతం

- Advertisement -
- Advertisement -

Over 63 per cent polling for Punjab Assembly

63 శాతానికి పైగా పోలింగ్
ఓటేసిన ప్రధాన పార్టీల నేతలు
తొలిసారి ఓటు హక్కు వినియోగించుకున్న అవిభక్త సోదరులు

చండీగఢ్: పంజాబ్ అసెంబ్లీకి ఆదివారం జరిగిన ఎన్నికల్లో సాయంత్రం 5 గంటల వరకు 63 శాతానికి పైగా ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనున్న నేపథ్యంలో ఓటింగ్ శాతం మరింత పెరిగే అవకాశం ఉంది. రాష్ట్రంలోని మొత్తం 117 అసెంబ్లీ స్థానాలకు ఒకే రోజు పోలింగ్ జరిగింది. గట్టి భద్రతా ఏర్పాట్ల మధ్య పోలింగ్ ప్రశాంతంగా ముగిసినట్లు అధికారులు తెలిపారు. ఎన్నికల నిర్వహణ కోసం రాష్ట్ర పోలీసు బలగాలతో పాటుగా 700 కంపెనీల పారా మిలిటరీ బలగాలను సైతం మోహరించారు. 93 మంది మహిళలు, ఇద్దరు ట్రాన్స్‌జెండర్లు సహా మొత్తం 1,304 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకొంటున్నారు. సాయంత్రం 5 గంటల వరకు సగటున 63.44 శాతం పోలింగ్ జరిగినట్లు పంజాబ్ ముఖ్య ఎన్నికల కార్యాలయం తెలియజేసింది. మన్సాలో అత్యధికంగా 73.45 శాతం పోలింగ్ జరగ్గా, మాలెర్‌కోట్లాలో 72.84 శాతం పోలింగ్ జరిగింది. ఫాజిల్కాలో 70.70 శాతం, సంగ్రూర్‌లో 70.43 శాతం, ముక్తసార్‌లో 72.84 శాతం.

అమృత్‌సర్‌లో 57.74 శాతం పోలింగ్ జరగ్గా మొహాలిలో అతి తక్కువగా 53.10 శాతం పోలింగ్ నమోదైంది. పంజాబ్ ఎన్నికల్లో భాగంగా ఓటు హక్కు వినియోగించుకున్న ఆయా పార్టీల అగ్రనేతలు ఈ ఎన్నికల్లో తమదేనంటూ ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉన్న చరణ్‌జిత్ సింగ్ చన్నీఖరార్ పోలింగ్ బూత్‌లో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. చామ్‌కౌర్ సాహిబ్, భదౌర్ నియోజకవర్గాలనుంచి పోటీ చేస్తున్న ఆయన ఈ ఎన్నికల్లో మరోసారి తమదే విజయమన్నారు. కాగా ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 20నుంచి 30 స్థానాలు కూడా రావని, రాష్ట్రంలో ఎన్‌డిఎ కూటమిదే విజయమని మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ అన్నారు. ఆయన పాటియాలలో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇక రాష్ట్రంలో శిరోమణి అకాలీదళ్‌బిఎస్‌పి గాలి వీస్తోందని, 80కి పైగా స్థానాల్లో తమదే విజయమని ఎస్‌ఎడి అధ్యక్షుడు సుఖ్‌బీర్‌సింగ్ బాదల్ పేర్కొన్నారు.

ఆయన భార్య, మాజీ కేంద్రమంత్రి హర్‌సిమ్రత్ కౌర్ బాదల్‌తో కలిసి ముక్తసార్‌లో ఓటేశారు. ఆయన తండ్రి ప్రకాశ్ సింగ్ బాదల్( 94)కూడా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆమ్‌ఆద్మీ పార్టీ సిఎం అభ్యర్థి భగ్వంత్ సింగ్ మాన్ మొహాలిలో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఆయన కూడా తమదే విజయమన్న ధీమా వ్యక్తం చేశారు. అమృత్‌సర్‌లోని పోలింగ్ బూత్‌లో పిసిసి అధ్యక్షుడు నవ్‌జ్యోత్‌సింగ్ సిద్ధూ, ఆయన ప్రత్యర్థి ఎస్‌ఎడి నేత బిక్రమ్ సింగ్ మజిథాలు పరస్పరం ఎదురు పడగా, ఇరువురూ ఒకరికొకరు అభివాదం చేసుకున్నారు.

తొలిసారి ఓటేసిన అవిభక్త సోదరులు

కాగా అమృత్‌సర్‌కు చెందిన అవిభక్త సోదరులు సోహన్‌సింగ్, మోహన్‌సింగ్‌లు తొలిసారి విడివిడిగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇందుకోసం అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. గత ఏడాది 18వ ఏట అడుగుపెట్టిన వీరిద్దరికీ ఇటీవలే విడివిడిగా ఓటర్ గుర్తింపు కార్డులను పంజాబ్ ముఖ్య ఎన్నికల అధికారి ఎస్ కరుణ రాజు అందజేశారు. చండీగఢ్ శివార్లలోని జిరాక్‌పూర్ గ్రామంలో ఓ నవ వధువు పెళ్లి దుస్తుల్లో వచ్చి ఓటు హక్కు వినియోగించుకుంది. రాష్ట్రంలో మహిళాసిబ్బందే నిర్వహించే పింక్ పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు ముఖ్యంగా తొలిసారి ఓటు వేయడం కోసం వచ్చిన యువతులు ఉత్సాహంగా ఓటింగ్‌లో పాల్గొన్నారు. రాష్ట్రంలో 196 పింక్ పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. వచ్చే నెల 10న రాష్ట్రంలో ఫలితాలు వెల్లడిస్తారు.

యుపి మూడో విడతలో 58 శాతం

ఇక ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల మూడో విడతలో భాగంగా ఆదివారం 16 జిల్లాల పరిధిలోని 59 అసెంబ్లీ నియోజకవర్గాలకు జరిగిన ఎన్నికల్లో సాయంత్రం 5 గంటల వరకు 58.07 శాతం పోలింగ్ జరిగినట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. మూడో విడత పోలింగ్‌లో భాగంగా సమాజ్‌వాది పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్, ఆయన భార్య డింపుల్ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కర్హల్ నియోజకవర్గంనుంచి అఖిలేష్ తొలిసారి అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు. సమాజ్‌వాది పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ కూడా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. జశ్వంత్‌పూర్‌లోని పోలింగ్ కేంద్రానికి వీల్‌చైర్‌లో వచ్చి ఓటేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News