సంగమేశ్వర,
బసవేశ్వర
పథకాలకు శ్రీకారం
సభ ఏర్పాట్లను
అన్నీ తానై
పర్యవేక్షిస్తున్న
మంత్రి హరీష్ రావు
జనం భారీగా
తరలివచ్చే అవకాశం
మన తెలంగాణ/సంగారెడ్డి బ్యూరో: మెదక్ జిల్లాలోని సంగారెడ్డి, నారాయణఖేడ్, అంధోల్, జహీరాబాద్ నియోజకవ ర్గాల్లోని సుమారు 19 మండలాల పరిధిలోని 3.9-0 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే వర ప్రధాయని సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాలకు నేడు ముఖ్యమంత్రి కెసిఆర్ శంకుస్థాపన చేయనున్నారు. ఈ నేపథ్యంలో సిఎం కెసిఆర్ పర్యటనను గులాబీ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇటీవల పరిణామాల నేపథ్యంలో నారాయణఖేడ్‌లో సోమవారం కెసిఆర్ పాల్గొనే సభకు భారీ ఎత్తున జన సమీకరణకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. మునుపెన్నడూ లేనివిధంగా పెద్దఎత్తున జనం వచ్చేలా చేయడం ద్వారా విపక్షాలకు, అదే సమయంలో కేంద్రంలోని బిజెపికి సవాల్ విసరాలన్న సంకల్పం అడుగడుగునా పార్టీ నేతల్లో కనపడుతోంది.
ఇందుకోసం ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీర్ హరీష్‌రావు అంతా తానై ఏర్పాట్లలో తలమునకలౌతున్నారు. బహిరంగ సభకు సంబంధించి ఎప్పటికప్పుడు నారాయణఖేడ్‌లో పర్యటించి అటు అధికారులకు, ఇటు టిఆర్‌ఎస్ నేతలకు సూచనలిస్తూ బహిరంగ సభను సక్సెస్ చేసేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. వేదిక ఏర్పాటు దగ్గర్నుంచి, సభ ఏర్పాట్లు, జన సమీకరణ, కార్యకర్తల తరలింపు, నాయకులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తదితర అంశాలపై ఇప్పటికే మూడు దఫాలుగా చర్చించారు. ఆదివారం కూడా సిద్దిపేట ప్రాంతంలో మంత్రి సుడిగాలి పర్యటన చేశారు. మళ్లీ మధ్యాహ్నానికి నారాయణఖేడ్‌కు వచ్చి సిఎం సభకు ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఆ విధంగా ఏ లోపం తలెత్తకుండా హరీష్ చర్యలు తీసుకుంటున్నారు.
సంగమేశ్వర, బసవేశ్వర ప్రాజెక్టుల ద్వారా ఈ ప్రాంతం సస్యశ్యామలం కాబోతున్నది. దశాబ్దాలుగా వెనుకబాటుకు గురైన ప్రాంతంలో ఈ ప్రాజెక్టును ఏర్పాటు చేయడం ద్వారా ప్రగతికి కెసిఆర్ శ్రీకారం చుడుతున్నారు. ఈ ప్రాంతంలోని ప్రతి సమస్యపై సిఎంకు సంపూర్ణ అవగాహన ఉండడంతో ఆయన పర్యటనకు మరింత ప్రాధాన్యత ఏర్పడింది. 1074 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టే బసవేశ్వర ప్రాజెక్టుకు సిఎం సోమవారం శంకుస్థాపన చేసి ఈ ప్రాంత ప్రజల ఆకాంక్షలన్నింటిని నెరవేర్చుతున్న సిఎంగా కెసిఆర్ ఎవ్వరికీ అందనంత ఎత్తులో మరోసారి నిలవనున్నారు. ఇతర రాష్ట్రాలకు స్ఫూర్తిగా అనేక కార్యక్రమాలను అమలు చేస్తున్నారు. నారాయణఖేడ్ అంటేనే రాళ్లు, రప్పలు, కొండలతో నిండే ఉండే ప్రాంతం, అలాంటి ప్రాంతంలో ప్రాజెక్టును నిర్మించడం ద్వారా అన్ని మండలాలకు నీరు అందించబోతున్నారు. కెసిఆర్ చొరవతో 1,67,000 ఎకరాలకు సాగు నీరు ఇవ్వాలన్నది లక్షంగా ఉంది.
గోదావరి జలాలను సింగూరు ప్రాజెక్టుకు అనుసంధానం చేయడం ద్వారా ఈ ప్రాంతానికి నీటి కొరతను శాశ్వతంగా పరిష్కరించబోతున్నారు. ఆ విధంగా అతి పెద్ద సమస్యను పరిష్కరించడమే లక్షంగా ప్రభుత్వం కదులుతోంది. ఈ సందర్భంగా భారీ సభను జరపడం ద్వారా ప్రజలకు తమ అభిప్రాయాన్ని వివరించాలని భావిస్తున్నారు. సంగారెడ్డి జిల్లా అధ్యక్షునిగా చింతా ప్రభాకర్ నియామకం తర్వాత తొలిసారిగా జిల్లాకు కెసిఆర్ వస్తుండడంతో ఆయన కూడా తనవంతుగా కష్టపడుతున్నారు. నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి, ఆంధోల్ ఎమ్మెల్యే క్రాంతికిరణ్, జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్‌రావు, ఎంపి బిబి పాటిల్, దేవేందర్‌రెడ్డి, ఇతర నేతలంతా సిఎం పర్యటన విజయవంతానికి పాటుపడుతున్నారు. కార్పోరేషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ సైతం ఆదివారం జిల్లాలో పర్యటించి సిఎం సభను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులను కోరారు.