చిత్తూరు: టాస్క్ ఫోర్స్ జరిపిన వరుస దాడులలో గత మూడు రోజుల్లో 31 ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకోవడంతో పాటు, ఇద్దరు స్మగ్లర్లను అరెస్టు చేసినట్లు టాస్క్ ఫోర్స్ ఎస్పీ మేడా సుందరరావు తెలిపారు. సోమవారం టాస్క్ ఫోర్స్ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. తమ టీమ్ లు గత మూడు రోజులుగా వరుస దాడులను నిర్వహించినట్లు చెప్పారు. డీఎస్పీ మురళీధర్, ఆర్ఐ సురేష్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో దాడులు చేపట్టినట్లు తెలిపారు. సోమవారం తెల్లవారు జామున ఆర్ఎస్ ఐలు విశ్వనాథ్, వినోద్ కుమార్ టీమ్ లు రేణిగుంట మండలం తిమ్మినాయుడు పాలెం పరిధిలోని అడవిలో కూంబింగ్ చేస్తుండగా కొందరు వ్యక్తులు ఎర్రచందనం దుంగలను మోసుకుని వస్తూ తారస పడ్డారని తెలిపారు. వారిని చుట్టుముట్టగా దుంగలను పడేసి పారిపోయారని చెప్పారు.
అయితే తమ సిబ్బంది వారిని వెంబడించి ఇద్దరిని పట్టుకోగా, మిగిలిన వారు చీకట్లో కలిసి పోయారని చెప్పారు. పట్టుబడిన వారిని తమిళనాడు వేలూరు జిల్లా, పెంజమానదైకు చెందిన పి.రాజేంద్రన్(41), కె.కుమార్(35)లుగా గుర్తించినట్లు తెలిపారు. అదే విధంగా ఈ నెల 20వ తేదీన ఆర్ ఎస్ఐ లింగాధర్ టీమ్ శ్రీవారి మెట్టు సమీపంలో 11 ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకున్నామని అన్నారు. ఇంకా రాజంపేట డివిజన్ ఓబులవారి పల్లి ముసలి కుంట వద్ద ఆర్ఐ కృపానంద పది ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. ఈ 31 ఎర్రచందనం దుంగలు 836 కిలోలు ఉండగా, వీటి విలువ సుమారు 40 లక్షల రూపాయలు ఉంటుందని చెప్పారు. ఈ కేసులని సిఐ చంద్రశేఖర్ దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో సిఐ చంద్రశేఖర్, ఎఫ్ఆర్ఓ ప్రేమ, ఆర్ఎస్ఐ లు పాల్గొన్నారు.
Two Red Sandal Smugglers Arrest in Renigunta