మన తెలంగాణ/సిటీ బ్యూరో: మహిళలపై జరిగిన నేరాలకు సంబంధించిన కేసులను సత్వరమే పరిష్కరించాలని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సి.వి.ఆనంద్ సిసిఎస్ పోలీసులను అదేశించారు. సోమవారం వివిధ పెండింగ్ కేసులకు సంబంధించి సిసిఎస్‌లో కమిషనర్ సమిక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా కమిషనర్ సి.వి.ఆనంద్ మాట్లాడుతూ పెండింగ్ కేసులపై ఎప్పటికప్పుడు సమిక్షించడం ద్వారా వాటిని సకాలంలో పరిష్కరించాలని సూచించారు. మాదక ద్రవ్యాల కేసుల్లో మరింత సమర్థవంతగా దర్యాప్తు చేయాల్సిన అసరముందని, నార్కోటిక్ దర్యాప్తును సమర్థవంతంగా నిర్వహించేందుకు గాను నగరంలోని పోలీసులందరికీ ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నట్లు సిపి వెల్లడించారు.
సైబర్ నేరాలు రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ఆర్ధిక నేరాల నియంత్రణనకు గాను దర్యాప్తు వ్యూహాలను పునర్వవస్థీకరించనున్నట్లు తెలిపారు. అనుమానితులను కనిపెట్టడం, వారిని పట్టుకోవడానికి సాకేంతిక పరిజ్ఞానాన్ని విస్తృతంగా వినియోగించుకోవాలని సూచించారు. అత్యవసరమైతే తప్ప సిసిఎస్ సిబ్బందికి ఇతర విధులను కేటాయించవద్దని సిపి ఆదేశించారు. అదేవిధంగా వనరులు, వాహనాల కేటాయింపులో సైతం సిసిఎస్ విభాగానికి తగిన ప్రాధాన్యత ఇవ్వనున్నమని తెలిపారు. సిసిఎస్ పోలీసుల పనితీరుపై ఎలాంటి ఫిర్యాదులు రాకుండా పని చేయడం ద్వారా పూర్వ వైభావాన్ని సాధించే విధంగా కృషి చేయాలన్నారు.
త్వరలోనే జోనల్ క్రైమ్ టీమ్‌లను ఏర్పాటు చేయనున్నామని, వారికి అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు, వాహనాలను సమకూర్చనున్నట్లు వెల్లడించారు. క్షేత్రస్థాయిలో పోలీసులను అందుబాటులో ఉంటే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ సందర్భంగా కమిషనర్ సిసిఎస్ భవనాన్ని పరిశీలించడంతో పాటు అక్కడి సిబ్బంది, అధికారులతో ముచ్చటించారు. ఈ సమిక్ష సమావేశంలో అడిషనల్ సిపి క్రైమ్స్ ఎ.ఆర్.శ్రీనివాస్, సిసిఎస్ జాయింట్ సిపి గజరావు భూపాల్, ఇతర అధికారులు పాల్గొన్నారు.