స్కూళ్లు, కాలేజీల మూసివేత… ఆంక్షలు విధింపు
హతుని కుటుంబానికి హోం మంత్రి జ్ఞానేంద్ర పరామర్శ
శివమొగ్గ (కర్ణాటక) : కర్ణాటక లోని శివమొగ్గ జిల్లాలో భజరంగ్ దళ్ కార్యకర్త 23 ఏళ్ల హర్ష హత్య రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. జిల్లా కేంద్రం శివమొగ్గలో రవివర్మ వీధి లోని భారతి కాలనీలో ఆదివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు భజరంగ్ దళ్ కార్యకర్త హర్షపై కత్తులతో దాడి చేయడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు . రాష్ట్ర రాజధాని బెంగళూరుకు దాదాపు 250 కిమీ దూరంలో ఈ పట్టణం ఉంది. ఈ సంఘటనకు నిరసనగా అనేక చోట్ల భజరంగ్ దళ్ కార్యకర్తలు సోమవారం ఆందోళనలు చేపట్టారు. భజరంగ్‌దళ్ మద్దతు దారులు కొంతమంది వీధుల్లోకి వచ్చి కోపంతో రాళ్లు రువ్వి కొన్ని ఘర్షణలకు పాల్పడ్డారు. కొన్ని చోట్ల ఆందోళనకారులు టైర్లు, వాహనాలు దగ్ధం చేశారు. ఉద్రిక్త పరిస్థితులు తలెత్తడంతో అధికారులు రెండు రోజుల పాటు శివమొగ్గ పట్ణణంలో ఆంక్షలు విధిస్తూ నిషేధాజ్ఞలు జారీ చేశారు. సోమవారం స్కూళ్లకు, కాలేజీలకు శెలవు ప్రకటించారు. హిజాబ్ వివాదం సమయంలో ఈ హత్య జరగడంతో రాష్ట్రం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. సోమవారం ఉదయం హర్ష కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళన చేపట్టారు.
వారికి కొందరు భజరంగ్ దళ్ కార్యకర్తలు మద్దతు పలికారు. రోడ్లపై ర్యాలీలు చేపట్టి నిరసన తెలియచేశారు. రాష్ట్రముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై వెంటనే స్పందిస్తూ ఈ సంఘటనపై దర్యాప్తు మొదలైందని, కొన్ని కీలకమైన ఆధారాలు లభించాయని, హంతకులను వెంటనే అరెస్టు చేస్తామని, ఈలోగా వదంతులు నమ్మవద్దని, శాంతిభద్రతలను కాపాడాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మరోవైపు ఈ సంఘటన రాజకీయ వివాదాలకు తెరతీసింది. ప్రతిపక్షనాయకుడు, కాంగ్రెస్ నేత సిద్దరామయ్య రాష్ట్రహోం మంత్రి ఆరగ జ్ఞానేంద్ర రాజీనామాకు డిమాండ్ చేశారు. దీనిపై సిఎం స్పందిస్తూ సిద్దరామయ్య రాజకీయాలతో అశాస్త్రీయంగా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు.జ్ఞానేంద్ర వెంటనే శివమొగ్గ లోని బాధితుల కుటుంబీకులను కలుసుకుని ధైర్యం చెప్పారు. ఈ సంఘటన వెనుక ఉన్నవారిని తక్షణం అరెస్టు చేస్తామని విలేఖరులకు చెప్పారు. ఇలాంటి సంఘటనలు మళ్లీ జరగకూడదన్నారు.
ముస్లిం గూండాల హస్తం : మంత్రి కెఇ ఈశ్వరప్ప ఆరోపణ
రాష్ట్ర గ్రామీణాభివృద్ధి , పంచాయతీరాజ్ మంత్రి కెఇ ఈశ్వరప్ప (శివమొగ్గ ఎంఎల్‌ఎ కూడా) ఈ హత్యవెనుక ముస్లిం గూండాల హస్తం ఉందని ఆరోపించారు. నలుగురైదుగురు దుండగులు హర్షను కత్తితో పొడిచి చంపారని ఆరోపించారు. హిజాబ్ నిరసనల సమయంలో చేసిన వ్యాఖ్యల వల్ల హర్ష హత్యకు ప్రేరేపించారని మంత్రి ఆరోపించారు. రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు డికె శివకుమార్ తన ప్రకటనలతో అసాంఘిక సంఘటనలకు ప్రేరేపించారని వేలెత్తి చూపించారు. శివమొగ్గలో ఇలాంటి రౌడీయిజాన్ని సాగనివ్వబోమని, ఇలాంటి సంఘటనలను అదుపు చేస్తామని మంత్రి పేర్కొన్నారు. హతుని కుటుంబానికి ఎలాంటి సమస్యలు రాకుండా చూస్తామని భరోసా ఇచ్చారు.
పీపుల్స్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా, సోషల్ డెమొక్రాటిక్ పార్టీ ఆఫ్ ఇండియా లను నిషేధించాలని శ్రీరామ్ సేన కన్వీనర్ ప్రమోద్ ముథాలిక్ డిమాండ్ చేశారు. శివమొగ్గ పట్టణంలో నిషేధాజ్ఞలు అమలవుతున్నాయని, స్కూళ్లు, కాలేజీలు మూసివేయడమైందని డిప్యూటీ కమిషనర్ సెల్వమణి ఆర్ విలేఖరులకు తెలియజేశారు. ఈ హత్యవెనుక ఉన్న హంతకులను పట్టుకోడానికి టాస్క్‌ఫోర్సు ఏర్పాటు చేయడమైందని పోలీస్ సూపరింటెండెంట్ బిఎం లక్ష్మీప్రసాద్ విలేఖరులకు వెల్లడించారు. దర్యాప్తునకు ప్రజలు సహకరించాలని, ఉద్రేకానికి లోను కావద్దని విజ్ఞప్తి చేశారు.