మనతెలంగాణ/ హైదరాబాద్ : వెనుకబడిన తరగతుల కమిషన్ సభ్యులు వివిధ రాష్ట్రాల్లో క్షేత్ర స్థాయిలో అధ్యయనం జరిపేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో క్షేత్ర స్థాయిలో అక్కడి ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ఆ రాష్ట్రాల్లో బిసి కమిషన్లు అనుసరిస్తున్న విధానాలపై అవగాహన పొందేందుకు రాష్ట్ర బిసి కమిషన్ బృందం పర్యటించనున్నది. రెండు నెలల క్రితం కర్ణాటక రాష్ట్ర బిసి కమిషన్ బృందం మన రాష్ట్రంలో పర్యటించింది. ఇక్కడి బిసి గురుకులాల్లో అమలు అవుతున్న కార్యక్రమాలు, విద్యాబోధన తదితర అంశాలపై క్షేత్రస్థాయిలో పర్యటించి అధికారులతో విషయాలను తెలుసుకున్నారు. త్వరలోనే రాష్ట్ర బిసి కమిషన్ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్‌రావు, సభ్యులు శుభప్రద్, కిషోర్‌గౌడ్, ఉపేందర్‌తో పాటు కమిషన్ కార్యదర్శి, అధికారులు మూడు రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. మార్చి, ఏప్రిల్, మే నెలల్లో ఆ రాష్ట్రాల్లో క్షేత్రస్థాయి అధ్యయనానికి వెళ్లనున్నారు. ముఖ్యంగా ఆ రాష్ట్రాల్లో వెనుకబడిన తరగతుల కోసం ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలతో పాటు, కులవృత్తుల్లో ఆధునిక యంత్రాల వినియోగం, వివిధ కులాల అధ్యయానికి, వారి సంక్షేమానికి అనుసరిస్తున్న విధానాలపై అధ్యయనం చేయనున్నారు.