Thursday, November 14, 2024

రోహిత్ కెప్టెన్సీ అదరహో..

- Advertisement -
- Advertisement -

Appreciated as social media platform on Rohit sharma captaincy

మన తెలంగాణ/క్రీడా విభాగం: రోహిత్ శర్మ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆడిన తొలి సిరీస్‌లోనే టీమిండియా అటు వన్డేల్లో, ఇటు టి20లలో క్లీన్‌స్వీప్ చేసింది. దీంతో రోహిత్ శర్మ కెప్టెన్సీపై సోషల్ మీడియా వేదికగా ప్రశంసలు పొటెత్తాయి. విరాట్ కోహ్లి కెప్టెన్సీ నుంచి తప్పుకోవడంతో రోహిత్‌కు ఇటు వన్డేల్లోనూ అటు టి20లలో సారథ్య బాధ్యతలు అప్పగించిన విషయం తెలిసిందే. ఇక తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెడుతూ రోహిత్ రెండు సిరీస్‌లలో కూడా జట్టును విజయపథంలో నడిపించాడు. బలమైన విండీస్‌ను ఇటు వన్డేలు, అటు టి20లలో చిత్తుగా ఓడిస్తూ జట్టుకు క్లీన్‌స్వీప్ అందించాడు. ఇప్పటికే ఐపిఎల్‌లో ముంబైకి పలుసార్లు ట్రోఫీలు సాధించి పెట్టిన సత్తా చాటిన రోహిత్ తాజాగా టీమిండియా కెప్టెన్‌గా కూడా అదరగొట్టాడు. విండీస్ సిరీస్‌లో జట్టును ముందుండి నడిపించాడు. అద్భుత కెప్టెన్సీతో ఒత్తిడిలోనూ నిలకడైన నిర్ణయాలు తీసుకుంటూ జట్టు గెలుపు బాటలో పయనించేలా చేశాడు. విండీస్‌తో జరిగిన సిరీస్‌లో భారత్ విజయం సాధిస్తుందని అందరూ భావించినా క్లీన్‌స్వీప్‌పై ఎవరికీ నమ్మకం లేదు.

పరిమిత ఓవర్ల క్రికెట్‌లో అత్యంత ప్రమాదకర జట్టుగా పేరున్న విండీస్‌ను ఓడించడం ఎంత పెద్ద జట్టుకైనా చాలా కష్టంతో కూడుకున్న అంశమే. దీనికి తోడు పొలార్డ్, హోల్డర్, పూరన్, పొవెల్, కింగ్స్ వంటి విధ్వంసక ఆటగాళ్లు ఉండడంతో విండీస్‌కు కూడా గెలుపు అవకాశాలు సమంగా కనిపించాయి. కానీ భారత్ మాత్రం రెండు సిరీస్‌లలోనూ అద్భుతంగా ఆడింది. యువ ఆటగాళ్లు సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్, ప్రసిద్ధ్ కృష్ణ, హర్షల్ పటేల్, రవి బిష్ణోయ్ తదితరులు జట్టు యాజమాన్యం తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెడుతూ ముందుకు సాగారు. ఇక సీనియర్, జూనియర్ ఆటగాళ్ల కలయికతో ఉన్న టీమిండియాను తనదైన కెప్టెన్సీతో ముందుకు తీసుకెళ్లడంలో రోహిత్ సఫలమయ్యాడు. ఓపెనర్‌గా దిగిన రోహిత్ పలు కీలక ఇన్నింగ్స్‌లు ఆడాడు. ఇదే క్రమంలో యువ ఆటగాళ్లకు తగు సలహాలు, సూచనలు ఇస్తూ వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపాడు. ఇది టీమిండియాకు ఎంతో కలిసి వచ్చింది. అందుకే విండీస్‌తో జరిగిన సిరీస్‌లో భారత్ చారిత్రక విజయాన్ని సొంతం చేసుకుంది. రానున్న శ్రీలంక సిరీస్‌లో మరింత ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగేందుకు ఈ విజయాలు దోహదం చేస్తాయనడంలో సందేహం లేదు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News