1.24 శాతానికి తగ్గిన పాజిటివిటీ రేటు
న్యూఢిల్లీ : గత కొద్ది రోజులుగా కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. వరుసగా మూడో రోజు కూడా తాజాగా 13 వేలకు కేసులు దిగొచ్చాయి. పాజిటివిటీ రేటు 1.24 శాతానికి క్షీణించింది. మృతుల సంఖ్య అదుపు లోనే ఉందని మంగళవారం కేంద్ర ఆరోగ్యశాఖ వివరించింది. సోమవారం 10,84,247 మందికి కరోనా పరీక్షలు చేయగా, 13,405 మందికి పాజిటివ్‌గా తేలింది. ముందు రోజు కంటే కేసులు 16 శాతం మేర తగ్గాయి. ఇప్పటివరకు 4.28 కోట్ల మందికి కరోనా సోకింది. గత 24 గంటల వ్యవధిలో 235 మంది మృతి చెందగా, ఇప్పటివరకు మొత్తం 5,12,344 మంది ప్రాణాలు కోల్పోయారు. క్రియాశీల కేసులు కూడా 2 లక్షల దిగువకు చేరాయి. ప్రస్తుతం క్రియాశీ కేసులు 1,81,075 వరకు ఉండగా, క్రియాశీల రేటు 0.42 శాతానికి తగ్గింది. సోమవారం 34,226 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. మొత్తం రికవరీలు 4.21 కోట్ల (98.38 శాతం) కు పైనే ఉన్నాయి. సోమవారం 35,50,868 మంది టీకా తీసుకోగా, ఇప్పటివరకు 175 కోట్లకు పైగా డోసులు పంపిణీ అయ్యాయని కేంద్రం వెల్లడించింది.