లక్నో: శ్రీలంకతో జరిగే ట్వంటీ20 సిరీస్ కోసం టీమిండియా సాధన ప్రారంభించింది. లంకతో భారత్ మూడు మ్యాచ్‌ల టి20 సిరీస్ ఆడనుంది. గురువారం లక్నో వేదికగా తొలి టి20 జరుగనుంది. ఇటీవలే వెస్టిండీస్‌తో జరిగిన వన్డే, టి20 సిరీస్‌లను టీమిండియా క్లీన్‌స్వీప్ చేసి జోరుమీదుంది. లంక సిరీస్‌లోనూ అదే జోరును కనబరచాలనే పట్టుదలతో కనిపిస్తోంది. రానున్న ప్రపంచకప్‌ను దృష్టిలో పెట్టుకుని భారత్ యువ ఆటగాళ్లకు జట్టులో చోటు కల్పించింది. విరాట్ కోహ్లి, రిషబ్ పంత్ కీలక ఆటగాళ్లకు విశ్రాంతి ఇచ్చారు. అయితే వారు లేకున్నా టీమిండియా బలంగానే ఉంది. రోహిత్ శర్మ కెప్టెన్సీకి రాహుల్ ద్రవిడ్ కోచింగ్ ప్రతిభ తోడు కావడంతో విండీస్ సిరీస్‌లో టీమిండియా అజేయంగా నిలిచింది.
ఇక లంక సిరీస్‌లో మరింత మెరుగైన ఆటను కనబరచాలనే పట్టుదలతో ఉంది. ఇదిలావుండగా మంగళవారం టీమిండియా క్రికెటర్లు ముమ్మర సాధన చేశారు. ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ పర్యవేక్షణలో సాధన కొనసాగింది. కెప్టెన్ రోహిత్‌తో పాటు సీనియర్లు బుమ్రా, రవీంద్ర జడేజా తదితరులు కూడా ప్రాక్టీస్ చేశారు. ఇక యువ ఆటగాళ్లకు ద్రవిడ్, రోహిత్‌లు పలు సలహాలు, సూచనలు ఇచ్చారు. మరోవైపు అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనే పట్టుదలతో యువ ఆటగాళ్లు ఉన్నారు.