ఈనెల 27వ తేదీ నుంచి ప్రయాణికులకు అందుబాటులోకి….
హైదరాబాద్: పండుగల రద్దీని క్యాష్ చేసుకోవడంలో టిఎస్ ఆర్టీసి ముందుంటుంది. అలాగే పండుగ పూట ప్రజలకు ఇబ్బందులు ఎదురుకాకుండా నిరంతరం ఆర్టీసి రవాణా సౌకర్యం కల్పిస్తోంది. ప్రస్తుతం మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక బస్సులు నడపాలని ఆర్టీసి నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు రంగారెడ్డి రీజనల్ మేనేజర్ వరప్రసాద్ తెలిపారు. హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాల నుంచి శ్రీశైలం దేవస్థానానికి 155 బస్సులను నడపనున్నట్లు ఆయన వెల్లడించారు. ఈనెల 27వ తేదీ నుంచి ఈ ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంటాయన్నారు.
ప్రత్యేక ఛార్జీలు ఇలా….
ఈనెల 27వ తేదీన- 20 బస్సులు, 28వ తేదీన 57, మార్చి 1వ తేదీన -59 బస్సులు, మార్చి2వ తేదీన- 19 బస్సులను నడిపిస్తున్నట్లు రంగారెడ్డి ఆర్‌ఎం వరప్రసాద్ వెల్లడించారు. ప్రధాన బస్‌స్టేషన్‌లు అయిన ఎంజీబిఎస్, జేబిఎస్, దిల్‌సుఖ్‌నగర్, ఐఎస్ సదన్ ప్రాంతాల నుంచి ఈ బస్సులు అందుబాటులో ఉంటాయన్నారు. ఎంజీబిఎస్ బస్టాండ్ నుంచి సూపర్ లగ్జరీ బస్సులకు రూ.510, డీలక్స్ బస్సులకు రూ.450, ఎక్స్‌ప్రెస్ బస్సులకు రూ.400 ఛార్జీలను వసూలు చేస్తున్నామని ఆయన తెలిపారు. నగరంలోని ఇతర ప్రాంతాల నుంచి సూపర్ లగ్జరీకి రూ.550, డీలక్స్-కు రూ.480, ఎక్స్‌ప్రెస్ – రూ.430 చార్జీలు చెల్లించాల్సి ఉంటుందని ఆయన తెలిపారు.