చార్జీల పెంపును ప్రజలందరూ సహృదయంతో అర్థం చేసుకోవాలి
ఇతర రాష్ట్రాలతో కరెంట్ చార్జీలను పోల్చి చూశాం
టిఎస్‌ఎస్‌ఎస్పీడిసిఎల్ సిఎండి రఘుమా రెడ్డి
హైదరాబాద్: విద్యుత్ ఛార్జీల పెంపు తప్పదని డిస్కంలు స్పష్టం చేశాయి. అందులో భాగంగా రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి బహిరంగ విచారణలో టిఎస్‌ఎస్‌ఎస్పీడిసిఎల్ సిఎండి రఘుమా రెడ్డి శుక్రవారం పాల్గొని డిస్కంల నష్టాల గురించి ఆయన వివరించారు. గృహ అవసరాలకు కూడా కరెంటు చార్జీలు పెంచాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు. చార్జీల పెంపును ప్రజలందరూ సహృదయంతో అర్థం చేసుకోవాలన్నారు. చార్జీల పెంపు ప్రతిపాదనలను ఈఆర్సీకి సమర్పించే ముందు ఇతర రాష్ట్రాలతో కరెంట్ చార్జీలను పోల్చి చూశామన్నారు. గృహ అవసరాలకు యూనిట్‌కు 50 పైసలు ,వాణిజ్య వినియోగదారులపై యూనిట్‌కు ఒక్క రూపాయి పెంచాలని ఈఆర్సీకి ప్రతిపాదనలు ఇచ్చామన్నారు.
రూ.9,128.57 కోట్ల లోటు
ట్రాన్స్‌కో ఈఆర్సీకి సమర్పించిన టారిఫ్‌ల్లో రూ.9,128.57 కోట్ల లోటు ఉందని వెల్లడించింది. ఛార్జీల పెంపు తర్వాత లోటు రూ.2686.79 కోట్లు ఉంటుందని అంచనా వేసింది. విద్యుత్ సరఫరాలో భాగంగా పెరుగుతున్న ఖర్చులు, నిర్వహణకు చార్జీలు పెంచక తప్పదని ట్రాన్స్‌కో స్పష్టం చేసింది. ఛార్జీలు పెంచితే రూ.5,044.27 కోట్లు సమకూరుతుందని ట్రాన్స్‌కో పేర్కొంది. ఛార్జీల పెంపు తర్వాత కూడా రూ.2,686 కోట్ల లోటు ఉంటుందని ట్రాన్స్‌కో అంచనా వేసింది. 2022, -23 సంవత్సరానికి సంబంధించిన అంచనాలు ఈ మేరకు వెల్లడించింది. విద్యుత్ సరఫరా ద్వారా మొత్తం రెవెన్యూ- రూ.34,870.18 కోట్లు కాగా విద్యుత్ ఛార్జీల ద్వారా రూ.25,421.76 కోట్ల ఆదాయం సమకూరుతుందని ట్రాన్స్‌కో అంచనా వేసింది. ఇతరత్రా రాబడిని కలుపుకుంటే వచ్చే రెవెన్యూ రూ.25,741.61 కోట్లు అని, సబ్సిడీ కింద రూ.1397.50 కోట్లు రాబడి వస్తుందని ఛార్జీల పెంపు తర్వాత లోటు రూ.2686.79 కోట్లు ఉంటుందని ట్రాన్స్‌కో వెల్లడించింది.