రాష్ట్రాలకు కేంద్రం లేఖ
న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు గణనీయంగా తగ్గుముఖం పట్టడంతో సామాజిక, క్రీడలు, వినోదం, విద్య, మతపరమైన కార్యక్రమాలతోపాటు రాత్రిపూట కర్ఫ్యూ ఆంక్షలను సడలించే విషయాన్ని పరిశీలించవలసిందిగా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను కేంద్ర హోం శాఖ శుక్రవారం కోరింది. కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయ్ భల్లా మార్చి నెల కోసం కొవిడ్ మార్గదర్శకాలను శుక్రవారం విడుదల చేస్తూ ఇటీవల కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ సూచించిన ప్రకారం కరోనా పరిస్థితిని అంచనా వేసుకుని ఆర్థిక కార్యకలాపాలను పునఃప్రారంభించే విషయాన్ని పరిశీలించాలని రాష్ట్రాలను కోరారు.
స్థానిక పరిస్థితులను జాగ్రత్తగా విశ్లేషించుకున్న తర్వాత సామాజిక, క్రీడలు, వినోదం, విద్య, సాంస్కృతిక, మతపరమైన కార్యక్రమాలు, రాత్రి కర్ఫూ, సాపింగ్ కాంప్లెక్సులు, సినిమా హాళ్లు, జిమ్‌లు, స్పాలు, రెస్టారెంట్లు, బార్లు, స్కూళ్లు, కాలేజీలు, ఆఫీసులు, ఇతర వాణిజ్య కార్యకలాపాలపై అమలులో ఉన్న ఆంక్షలను సడలించాలని ఆయన కోరారు. కాగా&మాస్కులు, ధరించడం, భౌతిక దూరాన్ని పాటించడం, చేతులు శానిటైజ్ చేసుకోవడం, పని చేసే చోట వెలుతురు బాగా ఉండేలా చూసుకోవడం వంటివి తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుందని కూడా ఆయన తన మార్గదర్శకాలలో పేర్కొన్నారు.