తిరువనంతపురం: “ముఖ్యమైన వస్తువులు తీసుకుని యూనివర్శిటీ హాస్టల్ బంకర్లకు వెళ్లమని మమ్మల్ని అధికారులు కోరారు. మా వద్ద ఆహారం, నీళ్లు కొంచమే ఉన్నాయి. నెట్‌వర్క్ కవరేజ్ కూడా ఏ క్షణంలోనైనా ఆగిపోవచ్చు” అని అరుంధతి ఆందోళన వ్యక్తం చేసింది. ఆమె ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లోని స్థానిక టెలివిజన్ ఛానెల్‌లో మాట్లాడుతూ ఈ విషయాన్ని తెలిపింది. తూర్పు యూరొప్ దేశమైన ఉక్రెయిన్‌పై రష్యా ఫిబ్రవరి 24 నుంచి దాడికి దిగింది. ఆమె వీడియో కాల్‌లో 60 మంది విద్యార్థులు తమ ముఖ్య వస్తువులతో నేలపై కిక్కిరిసి కూర్చుని ఉండడం కనిపించింది. వారున్న చోట డిమ్ లైట్ వెలుతురే ఉంది. 20 ఏళ్లలోపు ఉన్న అరుధంతి కేరళకు చెందిన వైద్య విద్యార్థిని. ఉక్రెయిన్ యూనివర్శిటీలో చదువుకుంటున్న మరో విద్యార్థిని అష్రా మాట్లాడుతూ తామేమి చేయాలి, ఎక్కడ ఉండాలి అనే స్పష్టమైన మార్గదర్శకాలు లేవని, ఉక్రెయిన్‌లో ఉన్న భారతీయ విద్యార్థులు చాలా ఆందోళనతో ఉన్నారని తెలిపింది.
“మా క్యాంపస్‌లో కేరళకు చెందిన 200 నుంచి 300 వరకు విద్యార్థులు ఉన్నారు. మాకెలాంటి స్పష్టమైన మార్గదర్శకాలు అందడంలేదు. బంకర్‌లోకి వెళ్లాలని మమ్మల్ని ఆదేశించారు. మేము మా వస్తువులు ప్యాక్ చేసుకుని అక్కడికి చేరుకున్నాక…మా యూనివర్శిటీ హెడ్ మమ్మల్ని మా హాస్టల్ రూమ్‌లకు వెళ్లాల్సిందిగా ఆదేశించారు. దాంతో మేము తిరిగి వచ్చాము. ఈ సమయం, సందర్భం చాలా రిస్కీగా ఉంది” అని ఆమె ఇంకా వివరించింది. ఇదిలావుండగా ఉక్రెయిన్‌లో చిక్కుకున్న 18000 మంది విద్యార్థుల రక్షణ చూస్తామని విదేశాంగ వ్యవహారాల సహాయ మంత్రి వి. మురళీధరన్ తెలిపారు. విద్యార్థులంతా కీవ్‌లోని భారత రాయబార కార్యాలయం ఆదేశాలు పాటించాలని కూడా సూచించారు. భారతీయ విద్యార్థులను ఉక్రెయిన్ నుంచి భారత్‌కు తీసుకురాడానికి గురువారం వెళ్లిన ఎయిర్ ఇండియా విమానం యుద్ధం కారణంగా ఆ దేశ గగనతలం మూసివేసి ఉండడంతో వెనక్కి తిరిగి వచ్చేసింది.