ఉక్రెయిన్‌తో చర్చలకు సిద్ధమని అధ్యక్ష కార్యాలయం ప్రకటన
మాస్కో: రష్యాఉక్రెయిన్ మధ్య భీకర పోరు కొనసాగుతున్న వేళ రష్యా అధ్యక్షుడి కార్యాలయం కీలక ప్రకటన చేసింది. ఉక్రెయిన్ అధికారుల బృందంతో చర్చలకు సిద్ధమని తెలిపింది. చర్చలకు బెలారస్ రాజధాని మిన్‌స్క్‌కు రష్యా బృందాన్ని పంపిస్తామని వెల్లడించింది. ఉక్రెయిన్ బలగాలు ఆయుధాలు వీడితే తాము చర్చలకు సిద్ధమేనని ఇప్పటికే రష్యా విదేశాంగ మంత్రి ప్రకటించిన విషయం తెలిసిందే. చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో టెలిఫోన్‌లో సంభాషించిన తర్వాత రష్యా అధ్యక్ష కార్యాలయం ఈ కీలక ప్రకటన చేయడం గమనార్హం. యుద్ధాన్ని ఆపాలని జిన్‌పింగ్ కూడా పుతిన్‌కు సూచించారు. మరోవైపు యుద్ధాన్ని ఆపాలని, చర్చలు జరపాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ కూడా రష్యాను కోరారు. ఉక్రెయిన్‌కు తటస్థ స్థాయిపై చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని కూడా ఆయన తెలిపారు. ఉక్రెయిన్ నాటో కూటమిలో చేరరాదని, తటస్థ వైఖరి అవలంబించాలని రష్యా మొదటినుంచీ డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లారోవ్ కూడా కీలక ప్రకటన చేశారు. ఉక్రెయిన్ సేనలు ఆయుధాలు వీడితే చర్చలకు సిద్ధమని ప్రకటించారు.