సబ్‌రిజిస్ట్రార్‌లకు ఆదేశాలిచ్చిన హైకోర్టు
అనధికార లేఅవుట్లలో ప్లాట్ల రిజిస్ట్రేషన్లపై హైకోర్టు కీలక తీర్పు
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో అనధికార లేఅవుట్లలో ప్లాట్ల రిజిస్ట్రేషన్లపై హైకోర్టు శుక్రవారం నాడు కీలక తీర్పు వెలువరించింది. రాష్ట్రంలో అనుమతి లేని లేఅవుట్లలో రిజిస్ట్రేషన్లు నిలిపివేస్తూ 2020లో ప్రభుత్వ ఉత్తర్వులు జారీచేసింది. ప్రభుత్వ ఉత్తర్వులను సవాల్ చేస్తూ హైకోర్టులో దాదాపు 5వేలకు పైగా పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ వ్యాజ్యాలపై విచారణ చేపట్టిన హైకోర్టు ఆయా ప్లాట్లను షరతులతో కూడిన రిజిస్ట్రేషన్ చేయాలని సబ్ రిజిస్రార్లకు హైకోర్టు స్పష్టం చేసింది. అదేవిధంగా రిజిస్ట్రేషన్ శాఖ జారీ చేసిన మోమోతో సంబంధం లేకుండా ప్లా ట్లను రిజిస్ట్రేషన్ చేయాలని, అయితే షరతులు వర్తిస్తాయని కొనుగోలు దారులకు ముందుగానే చెప్పాలని హైకోర్టు సూచించింది. 2020 రిజిస్ట్రేషన్ల శాఖ మోమో జారీ చేసిన తరువాత గతేడాది ఒక పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు ధర్మాసనం నిజాంపేట మున్సిపాలిటీ కమిషనర్, సబ్ రిజిస్ట్రార్‌కు అనధికార లేఅవుట్ల ప్లాట్ల రిజిస్ట్రేషన్ చేయాలని ఆదేశించింది.
దీంతో హైకోర్టు జారీ చేసిన ఆదేశాలను సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. కాగా ప్రస్తుతానికి ఆ పిటిషన్ సుప్రీంకోర్టు విచారణలో పెండింగ్‌లో ఉంది. ఈ నేపథ్యంలో ఇక నుంచి జరగబోయే రిజిస్ట్రేషన్లు అన్నీ సుప్రీంకోర్టు తుది తీర్పునకు లోబడే ఉంటాయని డాక్యూమెంట్‌లోని రెండవ పేజీలో స్పష్టంగా రాయాలని, ఇదే విషయాన్ని కొనుగోలు దారులకు తెలియజేయాలని సబ్ రిజిస్ట్రార్లకు హైకోర్టు ఆదేశించింది. అలాగే సుప్రీంకోర్టు తుది తీర్పునకు లోబడి ఉంటుందని డాక్యుమెంట్‌లో స్పష్టంగా రాయాలని సూచించడంతో పాటు ఇసి, వెబ్‌సైట్‌లోనూ పేర్కొనాలని తెలిపింది. అలాగే ఎఫ్‌టిఎల్, బఫర్ జోన్, 30 ఫీట్ల రోడ్డు లేని ప్లాట్ల కొనుగోళ్లపై కొనుగోలు దారులను ముందుగానే హెచ్చరించాలని సబ్ రిజిస్ట్రార్లను ఆదేశించింది. చట్ట ఉల్లంఘనల విషయంలో కొనుగోలుదారులదే బాధ్యతని డాక్యుమెంట్‌లో రాయాలని రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పులో పేర్కొంది. రిజిస్ట్రేషన్ డాక్యూమెంట్లతో పాటు ఎన్‌కంబరెన్స్ సర్టిఫికెట్, రిజిస్ట్రేషన్ వెబ్‌సైట్లలో కూడా ఇదే అంశాలను పేర్కొనాలని తెలిపింది. 2020లో ప్రభుత్వ ఉత్తర్వులను సవాల్ చేస్తూ కొన్ని వేల పిటిషన్లు దాఖలవుతున్న నేపథ్యంలో ఇదే అంశానికి సంబంధించి సుప్రీంకోర్టు తీర్పు వెలువడే వరకు ఈ నిబంధనలను పాటించాలని హైకోర్టు ఆదేశాలిచ్చింది.