ధర్మశాల: శ్రీలంకతో శనివారం జరిగే రెండో టి20 మ్యాచ్‌కు ఆతిథ్య టీమిండియా సమరోత్సాహంతో సిద్ధమైంది. తొలి మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈసారి కూడా అదే జోరును కొనసాగించాలనే పట్టుదలతో రోహిత్ సేన కనిపిస్తోంది. బ్యాటింగ్ బౌలింగ్ విభాగంలో భారత్ సమతూకంగా కనిపిస్తోంది. లక్నో మ్యాచ్‌లో యువ ఆటగాళ్లు ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్‌లు కదం తొక్కారు. ఈసారి కూడా చెలరేగేందుకు సిద్ధమయ్యారు. కెప్టెన్ రోహిత్ కూడా ఫామ్‌లో ఉండడం జట్టుకు కలిసి వచ్చే అంశమే. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే ఆటగాళ్లకు జట్టులో కొదవలేదు. దీంతో రెండో టి20లోనూ గెలిచి సిరీస్ సొంతం చేసుకోవాలని తహతహలాడుతోంది. మరోవైపు లంకకు ఈ మ్యాచ్ చావో రేవోగా మారింది. సిరీస్ అవకాశాలను సజీవంగా ఉంచుకోవాలంటే ఇందులో గెలవడం మినహా మరో మార్గం లేకుండా పోయింది. కిందటి మ్యాచ్‌లో లంక ఇటు బౌలింగ్, అటు బ్యాటింగ్‌లో ఘోరంగా విఫలమైంది. ఒక్క అసలెంకా మాత్రమే కాస్త నిలకడగా ఆడాడు. మిగతావారు పూర్తిగా చేతులెత్తేశారు. ఇలాంటి స్థితిలో భారత్‌తో పోరు లంకకు సవాల్ వంటిదేనని చెప్పాలి.