Friday, November 22, 2024

219మంది భారతీయులతో బయలుదేరిన తొలి ఎయిర్ ఇండియా విమానం..

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ఉక్రెయిన్‌పై రష్యా దాడి కారణంగా అక్కడ చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి తరలించేందుకు ఎయిర్ ఇండియా తొలి విమానం శనివారం మధ్యాహ్నం ముంబయి నుంచి రొమానియా రాజధాని బుకారెస్ట్‌కు బయలుదేరిందని అధికారులు తెలిపారు. ఇక రెండో విమానం ఢిల్లీ నుంచి శనివారం 11.40కు బయలుదేరి సాయంత్రం 6.30 గంటలకు (భారతీయ కాలమాన ప్రకారం) బుకారెస్ట్ చేరుకుంటుందని కూడా వారు తెలిపారు. ఉక్రెయిన్‌రొమానియా సరిహద్దుకు చేరుకున్న భారతీయులను భారతీయ ప్రభుత్వ అధికారులు బుకారెస్ట్‌కు చేర్చారు. భారతీయులను తరలించే తొలి ఎయిర్ ఇండియా 1944 విమానం బుకారెస్ట్‌లో మధ్యాహ్నం 1.55 గంటలకు బయలుదేరింది. అది రాత్రి 9.00 గంటలకు ముంబయి చేరుకోనుంది. ఇదిలా ఉండగా బయలుదేరిన ఎయిర్ ఇండియా రెండో విమానం(ఏఐ1942) కూడా మరి కొంత మంది భారతీయులను ఆదివారం తెల్లవారు జామున న్యూఢిల్లీకి తీసుకురానుంది. ప్రస్తుతం ఉక్రెయిన్‌లో దాదాపు 20,000 మంది భారతీయ విద్యార్థులు చిక్కుబడి ఉన్నారు. ఉక్రెయిన్‌లోని భారతీయ రాయబారకార్యాలయం రొమానియా, హంగరీల గుండా భారతీయులను స్వదేశానికి తరలించేందుకు ప్రయత్నిస్తున్నట్లు శుక్రవారం తెలిపింది. అయితే భారతీయులు తమ పాస్‌పోర్టులు, నగదు(ప్రధానంగా అమెరికా డాలర్లు), ఇతర ముఖ్యావసర వస్తువులు, కొవిడ్19 టీకా సర్టిఫికేట్‌లతో సరిహద్దు చెక్‌పాయింట్‌కు చేరుకోవాలని భారత రాయబార కార్యాలయం సూచించింది. అయితే వారు వచ్చే వాహనానికి భారతీయ జెండాను అతికించుకుని మరీ ప్రయాణించాలని పేర్కొంది. బుకారెస్ట్ రొమానియా సరిహద్దు చెక్‌పాయింట్‌కు దాదాపు 500కిమీ. దూరంలో ఉంది.
సమన్వయం లేకుండా సరిహద్దులకు వెళ్లొద్దు!
తమ సమన్వయం లేకుండా సరిహద్దులకు వెళ్లకూడదని కూడా ఉక్రెయిన్‌లోని భారతీయ రాయబార కార్యాలయం తెలిపింది.కీవ్, ఇతర కీలక నగరాల వైపుకు రష్యా బలగాలు కదులుతున్నాయి. కాల్పులు, బాంబింగ్‌లు, క్షిపణి దాడుల నేపథ్యంలో ఉక్రెయిన్‌లోని భారత రాయబార కార్యాలయం తాజా అడ్వయిజరీని జారీచేసింది. ఉక్రెయిన్ తూర్పు ప్రాంతంలో ఉన్న భారతీయులు తామున్న చోటే, ఇండ్లలో లేక షెల్టర్‌లలో సురక్షితంగా ఉండాలని కూడా కోరింది. హంగరీ, రొమానియా, పొలాండ్ గుండా రావాలనుకుంటున్న భారతీయుల కోసం పశ్చిమ ఉక్రెయిన్ నగరాలైన ఎల్వివ్, చెర్నివ్టీ నగరాల్లో భారత్ క్యాంప్ ఆఫీసులు నెలకొల్పింది. దీనికి తోడు హంగరీ, పొలాండ్, స్లోవాక్ రిపబ్లిక్, రొమానియా బార్డర్ పోస్ట్‌ల వద్ద అధికారుల బృందాలను కూడా భారత్ ఏర్పాటు చేసింది.

First Air India Plane fly with 219 Indians from Ukraine

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News