భద్రతామండలిలో రాజకీయ మద్దతును కోరారు
కీవ్: ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలొదిమిర్ జెలెన్‌స్కీ శనివారం ప్రధాని నరేంద్ర మోడీతో ఫోన్‌లో మాట్లాడారు. తమ దేశంపై రష్యా మిలిటరీ దాడిని నిలువరించడానికి ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో భారత్ రాజకీయ మద్దతు ఇవ్వాలని కోరారు. ఉక్రెయిన్‌పై రష్యా దాడిని తీవ్రంగా తూలనాడుతూ అమెరికా ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో తీర్మానం ప్రవేశపెట్టగా దానికి ఓటేయకుండా భారత్ గైర్హాజర్ అయిన కొన్ని గంటలకే అధ్యక్షుడు జెలెన్‌స్కీ టెలిఫోన్‌లో మోడీతో మాట్లాడారు. దీని గురించి ఆయన ట్వీట్ కూడా చేశారు.
ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి దిమిత్రో కులేబా, భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్‌తో టెలిఫోన్‌చేసి మాట్లాడి, ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తీర్మానానికి భారత్ మద్దతును కోరిన మరునాడే జెలెన్‌స్కీ టెలిఫోన్‌లో ప్రధాని మోడీతో మాట్లాడారు. మిలిటరీ దాడిని ఆపేసేలా రష్యాపై భారత్ తన ప్రభావాన్ని చూపాలని కూడా ఆయన కోరారు. ఉక్రెయిన్‌లో శాంతి నెలకొల్పడానికి సాయపడాలన్నారు. 15 దేశాల భద్రతామండలిలో శుక్రవారం మధ్యాహ్నం అమెరికా, అల్బేనియా ప్రవేశపెట్టిన ముసాయిదా తీర్మానంపై ఓటింగ్ జరిగింది. ఇందులో ఆస్ట్రేలియా, ఇస్తోనియా, ఫిన్లాండ్, జార్జియా, జర్మనీ, ఇటలీ, లీచ్‌టెన్‌స్టీన్, లిత్వేనియా, లగ్జెంబర్గ్, న్యూజిలాండ్, నార్వే, పొలాండ్, రొమానియా, ఇంగ్లాండ్ తీర్మానానికి అనుకూలంగా ఓటేశాయి. కాగా ఇండియా, చైనా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ గైర్హాజర్ అయ్యాయి.
కాగా తీర్మానానికి అనుకూలంగా 11 దేశాలు.. అల్బేనియా, బ్రెజిల్, ఫ్రాన్స్, గబన్, ఘనా, ఐర్లాండ్, కెన్యా, మెక్సికో, నార్వే, ఇంగ్లాండ్, అమెరికా ఓట్లు వచ్చాయి. అయితే ఐక్యరాజ్యసమితిలో శాశ్వత సభ్య దేశమైన రష్యా ఈ తీర్మానాన్ని బ్లాక్ చేసింది. తన వీటో అధికారాన్ని ఉపయోగించింది. “ఉక్రెయిన్‌లో నెలకొన్న పరిస్థితులపై భారత్ తీవ్ర ఆవేదనను వ్యక్తంచేస్తోంది. వెంటనే హింస, శత్రుత్వాన్ని ఆపేయాలని కోరుకుంటోంది” అని ఐక్యరాజ్యసమితి అంబాసిడర్‌గా ఉన్న భారత శాశ్వత ప్రతినిధి టిఎస్ తిరుమూర్తి తెలిపారు. ఆయన భద్రతా మండలి ఓటింగ్‌పై దేశ వివరణ ఇచ్చారు. కాగా చివరికి వచ్చిన ఫలితంపై ఐక్యరాజ్యసమితికి ఉక్రెయిన్ దూత అయిన సెర్గీ కిస్లిత్సా నిరాశను వ్యక్తంచేశారు.