Sunday, December 22, 2024

శాసనశాస్త్ర ఆవశ్యకత!

- Advertisement -
- Advertisement -

Epigraphy is a prime tool in recovering much of the first hand record of antiquity.
శాసన శాస్త్రం గురించి ప్రఖ్యాత ఎన్సైక్లోపీడియా బ్రిటానికా చెప్పిన మాటలివి. సాధారణంగా చరిత్ర ఒక నీటి చెలిమె లాంటిది. తవ్వుతున్న కొద్దీ ఊట లాగా ఎన్నో విషయాలు, వింతలు ప్రపంచానికి తెలియని మరెన్నో సత్యాలు వెలుగులోకి రావడం సహజమే! నిజానికి చరిత్రను నిర్దిష్ట శాస్త్రంగా మార్పులేని విషయంగా గమనిస్తారు. కానీ, చరిత్రకు ఉన్నంత నమ్యత (Flexibility), నవ్యత(Novelty) ఎప్పటికప్పుడు కొత్త ఆవిష్కరణలని ఆహ్వానించగలిగే తాత్త్వికత (Philosophy to welcome new discoveries) మరి ఏ శాస్త్రానికి లేదేమో అనిపిస్తుంది. నిన్నటివరకు ఇది చరిత్ర అనుకున్నది కొద్దికాలం తర్వాత జరిగిన నూతన అన్వేషణలు, నూతన ఆవిష్కరణల(New Revelations) వల్ల ఆ చరిత్ర మారడమో మరింత ముందుకు వెళ్లడమో లేక అప్పటి దాకా అనుకున్న చరిత్రకు కొత్త జోడింపు రావడమో జరుగుతుంది. అలా చరిత్ర ఎప్పుడూ నిర్మాణమవుతూ వెళుతుంది. దీనికి సింధూ నదీ నాగరికతే ఒక గొప్ప ఉదాహరణ. 1920 దశకం వరకు ప్రపంచం మొత్తం మీద ప్రాచీన నాగరికతలుగా మెసపటోమియా నాగరికత, ఈజిప్ట్ నాగరికత, గ్రీకు నాగరికత, చైనా నాగరికత మాత్రమే చెప్పుకోవడం జరిగింది. కానీ, 1920 తర్వాత అవిభక్త భారతదేశంలో నూతన రైలుమార్గం వేయడం కోసం తవ్వకాలు జరుపుతున్నప్పుడు సింధూ నది పరివాహక ప్రాంతంలో ప్రాచీన నాగరికత అవశేషాలు బయట పడడం జరిగింది. సర్ జాన్ మార్షల్, దయారామ్ సాహ్ని నేతృత్వంలో అక్కడ త్రవ్వకాలు జరపడం ద్వారా క్రీస్తుపూర్వం నాటి గొప్ప నాగరికత ఒకటి భారతదేశంలో విలసిల్లింది అని నిరూపించగలిగే చారిత్రక ఆధారాలు బయల్పడ్డాయి. హరప్పా, మొహంజోదారో వంటి ప్రాచీన నగరాలు వెలుగులోకి వచ్చాయి. చైనా నాగరికతకు, ఈజిప్టు నాగరికతకు, గ్రీకు నాగరికతకు, మెసపటోమియా నాగరికతకు తీసిపోని ఒక వైభవోపేతమైన ప్రాచీన నాగరికత భారత దేశంలో సైతం విరాజిల్లింది అని చెప్పగలిగిన గొప్ప ఆధారాలూ వెలికి వచ్చాయి. ఈ ఉదాహరణను బట్టి మనకి అర్ధమయ్యేది ఏంటంటే చరిత్ర ఎప్పుడూ నిరంతర నిర్మాణ శాస్రమే (Ever constructing science). అందుకే చరిత్రకి ఇదిఅంతం అనేది ఉండదు. చరిత్రకు ఫుల్ స్టాప్ లేదు, కామాలు మాత్రమే ఉంటాయి !. ఇలాంటి చరిత్ర ద్వారా ప్రతి సమాజానికి, ప్రతి జాతికి, మనుషులకి తన పూర్వీకుల గురించి, తమ కన్నా ముందు తరాల జీవన సంస్కృతి నుంచి ఇతర ఎన్నో అంశాలను అర్థం చేసుకోవడానికి, దాని ఆధారంగా భవిష్యత్తును నిర్మించుకోవడానికి ఒక ప్రాతిపదిక దొరుకుతుంది!
‘చరిత్ర’తో ప్రయోజనం?
చరిత్ర వల్ల లాభం ఏంటి? అనేది ఎన్నో ఏళ్ల నుంచి అందరినీ వేధించే ప్రశ్న!, చరిత్రవల్ల మానవజాతి ప్రస్థానం తెలుస్తుంది.! మన పరిణామం అర్థమవుతుంది.!, నేటి తీరుకి, తరహాకి, తరీఖాకి మూలాలు ఎక్కడున్నాయో అవగతం అవుతుంది!
ఇప్పుడు చూస్తున్న మహావృక్షపు కొమ్మల మూలాలు, వ్రేళ్ళు ఎక్కడున్నాయో అర్ధమైతే దాన్ని బట్టి ఆయా జాతులు, ‘మనుషులు’, దేశాలు, ప్రదేశాలు, ప్రాంతాల చరిత్రను మిగతా అన్ని అంశాలను అవగాహన చేసుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. మొత్తంగా మానవజాతిలోని వైవిధ్యత (Diversity) ను, వైవిధ్యతలోని విశిష్టత (Uniqueness)ను, విశిష్టతలోని విభిన్నత (Difference)ను, విభిన్నతలోని ప్రాముఖ్యత (Significance)ను గౌరవించడానికి మనందరికీ ఒక ఆదరువు దొరుకుతుంది. అందుకే చరిత్ర అధ్యయనం అంటే కేవలం సంవత్సరాలు, సంఘటనలు, వీరుల గాధలు, రాజ్యాలు, రాజభోగాలు, కట్టడాలు, నిర్మాణాలు, కోటలు మాత్రమే కాదు. చరిత్ర అంటే – మొత్తం మానవాళి సామూహిక జ్ఞాపకాల సంకలనం…! (Collection of collective memories of mankind). చరిత్ర అంటే – మనిషి మేధస్సు అట్టడుగు పొరల్లో దాగి ఉన్న సమూహ కార్యాల పునర్దర్శనం (Revisiting of collective efforts). ఇలాంటి ప్రాముఖ్యత కలిగిన చరిత్రను నిర్ధారించే ఆధారాలలో పురావస్తు ఆధారాలు (Archaeological Resources), లిఖిత ఆధారాలు (Written documents) ఎన్నో ఉన్నాయి. వాటిలో విశిష్టమైనవి శాసనాలు (Inscriptions), ఆ శాసనాలకు సంబంధించిన అధ్యయన శాస్త్రం ఎపిగ్రఫీ! ప్రాచీన కాలం నుంచి, మధ్య యుగాలు, ఆధునిక కాలం వరకు ప్రతి సందర్భంలో ఏదో ఒక అంశంపై రాజులు, రాజ్యాలు, దేశాలు శాసనాలను వేయించడం ద్వారా తమ విధానా న్ని, తమ పాలనరీతిని, తమ సంస్కరణ దృక్పథాన్ని, అనాటి సామాజిక, సాంస్కృతిక, ఆర్థిక, చారిత్రక పరిస్థితులని ప్రకటించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అందుకే శాసనాలు చరిత్ర నిర్మాణానికి ఒక ప్రధాన వనరుగా కొనసాగుతున్నాయి. శాసనాలు చరిత్ర రచన శాస్త్రానికి (Historiography) గొప్ప ఆసరాను అందిస్తున్నాయి.
శాసన శాస్త్రం అంటే ఏంటి?
రాళ్లు, శిలలు, రాతి స్తంభాలు, దేవాలయ కుడ్యాలు, రాగి పలకలు వంటి వాటిపై రాసిన భాష విషయ విశేషాలను అధ్యయనం చేసి చరిత్రను నిర్మించే శాస్త్రమే శాసనాల శాస్త్రంగా చెప్పవచ్చు. ఇక ఈ శాసనాలు మనకు ప్రధానంగా శిలలపై, లోహాలపై, మట్టిపాత్రలపై, కలపపై, తాళపత్రాలలో, వస్త్రాలపై, శంఖువులపై, కుడ్య చిత్రాలు, నాణాలపై మనకు కనిపిస్తాయి ! అయితే శాసన శాస్త్రం ఇలాంటి ప్రాచీన వస్తు సంస్కృతులకి ఆధారంగా ఉన్నప్పటికీ నిజానికి ఇది ఒక భాషాశాస్త్రం (Linguistics), ఒక లేఖనశాస్త్రం (Graphology), భాషా పరిణామ విశ్లేషణ శాస్త్రం (Philol ogy), అలాగే పద పరిణామ విశ్లేషణ శాస్త్రం (Etymology) వంటి మరెన్నో శాస్త్రాలు కలిసిన బహుళశాస్త్రం.
ఎపిగ్రఫీ ప్రధాన ఉద్దేశాలు సాధారణంగా రెండుగా కనిపిస్తాయి:
1. చేసిన పనులు, చట్టాలు లేదా నిర్ణయాలు క్షయం నాశనం కాకుండా పది కాలాల పాటు: నిలిచిపోవాలనేది.
2. ఒక తరం నుండి మరో తరానికి ఆనాటి సంప్రదాయ విధానాల గురించిన జ్ఞానాన్ని ఎరుకను బదిలీ చేయడం అనేది.
అయితే చరిత్రను నిర్మించడంలో పురా వస్తువులు, శిలాజ అవశేషాలు, మట్టి పాత్రలు, శిల్పాలు, చిత్రాలు, తాళపత్ర గ్రంధాలు కూడా ఎంతో ఉపకరిస్తాయి అనే విషయం మనందరికీ తెలిసిందే. అయితే వీటిని చరిత్ర నిర్మాణంలో ప్రాథమిక ఆధారాలుగా, ప్రాథమిక సాక్ష్యాలుగా భావించవచ్చు.
అలాగే ఈ శాసనాలలోని అంశాలు, విషయాలు, విశేషాల ఆధారంగా ఆయా కాలాలనాటి సామాజిక, సాంస్కృతిక, చారిత్రక, పురావస్తు విధమైన ప్రాచీనతను, సమాజ పరిణామాన్ని నిర్ధారించడానికి మనకు అవకాశాలు ఏర్పడతాయి.
ఏ భాషలో ఎన్ని శాసనాలు?
జర్నల్ ఆఫ్ ది గ్రాఫికల్ సొసైటీ ఆఫ్ ఇండియా వాల్యూమ్ 19-1903 ప్రకారం భారతదేశంలో ప్రాచీన కాలం నుంచి అంటే లిపి పుట్టిన నాటి నుంచి భాషల వారీగా శాసనాల గురించిన ఎన్నో విషయాలను అధ్యయనం చేయడం జరిగింది. దానిలో ఏ భాషల్లో ఎన్ని శాసనాలు ఇప్పటి వరకు వచ్చాయనే సంఖ్యాత్మకమైన పరిశోధనలు కూడా వారు చేశారు. దాన్ని అనుసరించి భారతీయ భాషలలో అత్యధికంగా తమిళ భాషలో 20 వేలకు పైగా శాసనాలు లభ్యమవుతున్నాయి అని తెలిపారు. భారతీయ భాషలు అన్నిటి లోకల్లా ప్రాచీన భాషగా తమిళం ఉండటం వల్ల, ప్రాచీనకాలం నుంచే శాసనాలు వేసే సంప్రదాయం బహుశా తమిళ భాషలో మొదలవడం వల్ల ఇది జరిగి ఉండొచ్చు అనేది చరిత్రకారుల అభిప్రాయం! అలాగే ఇప్పటి వరకు లభించిన వాటిలో కన్నడ భాషలో దాదాపు 10,600, సంస్కృత భాషలో 7500 వరకు శాసనాలు వివిధ కాలాల నాటివి లభిస్తున్నాయి. ఇక తెలుగు విషయానికి వస్తే ఇప్పటి వరకు జరిగిన చారిత్రిక పరిశోధనల్లో వెల్లడైన శాసనాల సంఖ్య 4,500 కు పైగా ఉంది.
వీటన్నిటి ద్వారా ప్రాంతాలు, రాజ్యాలు, రాజ్యాల కాలమునాటి ఎన్నో విషయాలు – పాలనాపరమైనవి, సామాజిక, ఆర్థికపరమైన, విశ్వాసాల పరమైనవి ఎన్నో వెలుగులోకి వస్తున్నాయి.
అందుకే మనిషి పరిణామంలో ప్రాచీన మధ్యయుగ ఆధునిక యుగాలలో వచ్చిన మార్పులను అధ్యయనం చేయడానికి శాసన శాస్త్రం ఒక్క గొప్ప ఆధారంగా ఉంటూ వస్తుంది! ఇక ఇప్పటివరకూ లభ్యం అవుతున్న శాసనాల ఆధారంగా ఈ శాసనాలను రూపొందించే విధానంలో ఓ ప్రత్యేకత కనిపిస్తుంది.
శాసనాలు చేసే ఆకరాలు (sources) అంటే మాధ్యమాలుగా రాళ్లు (Rocks/stones), లోహాలు (Metal), మట్టి అంశాలు (Mud Works), కర్రకు సంబంధించిన అంశాలు (Wood works), వస్త్రాలు (Clothes), గోడలు (Walls), నాణాలు (Coins) వంటివి ఉండగా ఈ వేసే విధానం (టెక్నిక్)లో కటింగ్, కార్వింగ్, క్యాస్టింగ్, ఎంగ్రేవింగ్, ఎంబోసింగ్, స్క్రాచింగ్, డ్రాయింగ్ వంటి విధానాలు లేదా నైపుణ్యాలు మనకు కనిపిస్తాయి. ఇలా చేయడం వల్ల కాల పరిణామంలో రుతువుల మార్పులను అతిక్రమించి, ఆయా మాధ్యమాల మీద రాయబడిన రాతలు, చెక్కబడిన విషయాలు క్షయం కాకుండా నిలిచి ఉండటానికి అవకాశం ఏర్పడింది.

                                                                             మామిడి హరికృష్ణ, 8008005231

Epigraphy is prime tool in recovering of first hand record of antiquity

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News