శంషాబాద్ విమానాశ్రయం నుంచి వారి స్వగ్రామం వెళ్లడానికి
బస్సులో ఉచితంగా ప్రయాణం
మనతెలంగాణ/హైదరాబాద్: ఉక్రెయిన్ నుంచి వచ్చిన తెలంగాణ విద్యార్థులు శంషాబాద్ విమానాశ్రయం నుంచి వారి స్వగ్రామానికి వెళ్లడానికి ఆర్టీసి బస్సులో ఉచితంగా ప్రయాణించేలా అనుమతిస్తున్నట్టు ఆర్టీసి పేర్కొంది. విమానాశ్రయం నుంచి వారి సొంత స్థలానికి వెళ్లేందుకు ఆర్టీసి బస్సులో ఉచితంగానే ప్రయాణించేలా ఆదేశాలు జారీ చేశామని ఆ సంస్థ ఎండి సజ్జనార్ ప్రకటించారు. హైదరాబాద్ విమానాశ్రయంకు చేరుకున్న తరువాత ఎలాంటి టికెట్ తీసుకోకుండానే సొంతూరుకు ప్రయాణం చేయవచ్చని ఆయన తెలిపారు. ఆపదలో ఉండి సురక్షితంగా ఇళ్లకు చేరుకోవాలనుకునే విద్యార్థులకు బస్సు ఛార్జీ భారంగా మారకుండా ఉచిత ప్రయాణ సదుపాయం సౌకర్యాన్ని ఆర్టీసి కల్పించిందని సజ్జనార్ తెలిపారు. ఉక్రెయిన్ నుంచి తెలంగాణ విద్యార్థులంతా క్షేమంగా ఇళ్లకు చేరుకునేంత వరకు ఈ సౌకర్యం అందుబాటులో ఉండనునున్నట్లు ఆయన స్పష్టం చేశారు.
ఉక్రెయిన్ నుంచి ఢిల్లీ, ముంబై నగరాలకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక విమానాల ద్వారా వారిని ఉచితంగా తీసుకొస్తున్న విషయం తెలిసిందే. అక్కడి నుంచి వారిని హైదరాబాద్ విమానాశ్రయానికి తీసుకురావడానికి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది.