కీవ్‌లో ప్రజల భయాందోళనలు,
మరోదాడికి రష్యాసైనికుల సన్నాహాలు
ఉక్రెయిన్ రక్షణకు సాయం పెంపు చేసిన ఐరోపా, అమెరికా
కీవ్ ( ఉక్రెయిన్ ): గతవారం రోజులుగా సాగుతున్న రష్యాభీకర దాడిని ఉక్రెయిన్ సైనిక దళాలు వీరోచితంగా ప్రతిఘటించి రష్యా దళాలను ముందుకు సాగనీయడం లేదు. కీవ్ నగరానికి ఉత్తరాన 30 కిమీ దూరంలో రష్యాసాయుధ దళాలు మోహరించి ఉన్నాయని, వాటిని ఉక్రెయిన్ దళాలు ధైర్యంగా ప్రతిఘటిస్తున్నాయని బ్రిటన్ రక్షణ మంత్రిత్వశాఖ సోమవారం వెల్లడించింది. ఒకవైపు భీకర పోరు సాగుతుంటే మరో వైపు ఉక్రెయిన్ సరిహద్దులో బెల్లారస్‌లో ఉక్రెయిన్ , రష్యా ప్రతినిధుల మధ్య చర్చలు ప్రారంభం కావడం విశేషం. ఉక్రెయిన్ నుంచి ఆ దేశ రక్షణ మంత్రి , ఇతర కీలక అధికారవర్గాలు, పాల్గొనగా, రష్యా నుంచి అధ్యక్షుడు పుతిన్ సాంస్కృతిక సలహాదారుడు పాల్గొన్నారు. ఈ చర్చలు ఎంతవరకు ఫలితమిచ్చి యుద్ధవిరమణకు దారి తీస్తాయో చెప్పలేం. కీవ్ నగరంలో మాత్రం సోమవారం రాత్రి నాటికి కొంతవరకు బాంబుల దాడులు, పేలుళ్లు సద్దుమణికే అవకాశాలు ఉండవచ్చని భావిస్తున్నారు. కీవ్ నగరంలో ఎంతమంతి ప్రాణాలు కోల్పోయారో ఎవరూ చెప్పడం లేదు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ 16 మంది పిల్లలు చనిపోయారని, 45 మంది తీవ్రంగా గాయపడ్డారని, మరికొంతమంది గాయపడి ఉండవచ్చని సోమవారం ప్రకటించారు.
ఉక్రెయిన్ రక్షణకు తీవ్రయత్నం
కీవ్‌నగరానికి చేరువలో రష్యాదళాలు మోహరించి ఉన్నప్పటికీ ఎలాగైనా నగరాన్ని అలాగే ఉక్రెయిన్‌ను రక్షించుకోవాలన్న పట్టుదలతో ముందుకు వచ్చేవారికి ఉక్రెయిన్ ప్రభుత్వ ఆయుధాలను అందిస్తోంది. అంతేకాదు పోరాటంలో ఆరితేరే పటిమ కలిగిన, బాంబుల తయారీలో అనుభవం కలిగిన ఖైదీలను ఉక్రెయిన్ జైళ్ల నుంచి విడుదల చేస్తున్నారు.
ఉక్రెయిన్‌పై దాడి అంతసులువు కాదు …
క్రెమ్లిన్ ఊహించినట్టు ఉక్రెయిన్‌పై ఉక్రెయిన్‌పై దాడి అంతసులువు కాదని అమెరికా రక్షణ అధికారులు అంటున్నారు. రష్యాసెంట్రల్ బ్యాంకు ఆవరణ అంతా యుద్ధ టాంకుల శిధిలాలతో కనిపిస్తోంది. ఈ శిధిలాల నుంచి బయటపడడానికి సోమవారం ప్రయత్నాలు జరుగుతున్నాయి.
కీవ్‌లో తొలగని దాడి భయాలు
కీవ్‌లోని స్థానిక ప్రజలు రక్షణ కారిడార్ మీదుగా బయటకు వెళ్లిపోవచ్చని రష్యా మిలిటరీ అవకాశం కల్పించడం మరో దాడికి సిద్ధమౌతున్న పరిస్థితులను తెలియచేస్తోందని భయపడుతున్నారు. మూడు మిలియన్ జనాభా కలిగిన కీవ్ నగరమేయర్ తమ ప్రజలు ఏమవుతారో అని భయపడుతున్నారు. అయితే చాలామంతి కీవ్‌ను ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు తరలిపోయి ఉండవచ్చన్న సందేహం వెలిబుచ్చారు. షెల్లర్లు, నేలమాళిగలు, కారిడార్లలో తలదాచుకుంటున్న ఉక్రెనియన్లు బయటకు రాడానికి నిరీక్షిస్తున్నారు.
రెండో పెద్ద నగరం ఖార్ఖివ్, మరికొన్ని చోట్ల యుద్ధాలు
ఉక్రెయిన్ రెండో పెద్దనగరం ఖార్ఖివ్, మరికొన్ని వ్యూహాత్మక స్థావరాల్లో యుద్ధాలు ప్రారంభమయ్యాయి. మరియుపోల్ అనే ఆజోవ్‌సముద్ర ఓడరేవు అనిశ్చితితో అల్లాడుతోంది. దాడులతో ఉక్రెయిన్ వైమానిక స్థావరాలను స్వాధీనం చేసుకున్నట్టు రష్యా సైన్యాలు ప్రకటిస్తున్నా అవన్నీ అబద్దాలే అని అమెరికా అధికార వర్గాలు ఆదివారం ప్రకటించాయి.
రష్యా వాణిజ్య సంస్థలు విలవిల
రష్యా ఆర్థిక వ్యవస్థను అనిశ్చితి చేయడానికి పశ్చిమదేశాలు ప్రయత్నించడంతో రష్యా వాణిజ్యసంస్థలు ఆర్థికంగా పెనగులాడుతున్నాయి. వాటిని రక్షించుకోడానికి రష్యన్లు తమ బ్యాంకుల్లో నగదు నిల్వలను విత్‌డ్రా చేసుకుంటున్నారు. రూబుల్స్‌ను డాలర్లు, యూరోలుగా మార్చుకుంటున్నారు. ఐరోపా,అమెరికా దేశాల ఆంక్షలతో స్విఫ్ట్ వ్యవస్థ నుంచి రష్యాబ్యాంకులను కట్టడి చేయడంతో పుతిన్ అధ్యక్షునిగా ఇంతకాలం సాధించిపెట్టిన ఆర్థిక వ్యవస్థపై తీవ్ర పరిణామాలు తప్పవన్న అభిప్రాయం వినిపిస్తోంది.
ఉక్రెయిన్ రక్షణకు ఐరోపా, అమెరికా దేశాల సాయం
రెండో ప్రపంచ యుద్దం తరువాత ఐరోపాలో భీకర పోరును ప్రారంభించిన రష్యా అధ్యక్షుడు పుతిన్ దూకుడుకు అడ్డుకట్ట వేయాలన్న నిర్ణయంతో అమెరికా, ఐరోపా దేశాలు నౌకల ద్వారా ఉక్రెయిన్‌కు ఆయుధాలను , సైనిక బలగాలను చేరవేసే ప్రక్రియను ముమ్మరం చేశాయి. కఠిన ఆంక్షలు ఎలాగూ ఉన్నాయని, దీనికి తోడు మరిన్ని బలగాలను , క్షిపణులను ఉక్రెయిన్‌కు పంపుతామని అమెరికా, జర్మనీ తాజాగా ప్రకటించాయి. ఐరోపా ఖండంలో రెండో ప్రపంచ యుద్ధం తరువాత శాంతిని నెలకొల్పే సంకల్పంతో ఆవిర్భవించిన ఐరోపా యూనియన్ మొట్టమొదటిసారి మారణాయుధాలను, యుధ్ధ విమానాలను ఉక్రెయిన్‌కు పంపుతుండటం ఇదే ప్రథమం. అయితే ఉక్రెయిన్‌కు ఎలా మరిన్ని బలగాలను , క్షిపణులను పంపాలో ఇవి తర్జనభర్జన పడుతున్నాయి. దీనిపై సోమవారం ఐరోపా యూనియన్ రక్షణ మంత్రులు సమావేశమై చర్చించారు. జర్మనీ నుంచి ఉక్రెయిన్‌కు కావలసిన సహాయాలను, సైనిక బలగాలను పంపడానికి మార్గాలు తమ దేశం నుంచి అనుకూలంగా ఉన్నాయని జర్మనీ రక్షణ మంత్రి వివరించారు.
జెక్ నుంచి ఆదివారమే రైళ్ల ద్వారా ఆయుధాలు ఉక్రెయిన్‌కు తరలివెళ్లాయి. ఈ విధంగా నౌకల ద్వారా ఉక్రెయిన్‌కు అందివచ్చే సాయాలను ఎలా అడ్డుకోవాలో రష్యా యోచిస్తోంది. ఐరోపా దేశాల నుంచి ఎంతవరకు సాయం అందుతోందో నిఘా వేసింది. అయితే బెలారస్ నుంచి రష్యాకు సహాయంగా కొన్ని దళాలు వెళ్లి ఉండవచ్చని అమెరికా నిఘా సంస్థలతో సంబంధం ఉన్న సీనియర్ అధికారి అంచనా వేశారు. ఉక్రెయిన్ ప్రస్తుత ప్రభుత్వాన్ని కూలదోసి దానికి బదులు తన చెప్పుచేతల్లో ఉండే పాలకవర్గాన్ని ఉక్రెయిన్ పీఠమెక్కించడానికి , ప్రఛ్చన్న యుద్ధ ప్రభావాన్ని తిరిగి పునరుద్ధరించడానికి పుతిన్ ఆరాటపడుతున్నారని పశ్చిమదేశాలు నమ్ముతున్నాయి. ఈ పరిస్థితుల్లో ఉక్రెయిన్‌పై దాడి అణ్వాయుధ యుద్ధానికే దారి తీయగలదన్న పుతిన్ హెచ్చరికలు తీవ్ర భయాందోళనలను రేకెత్తిస్తున్నాయి. ఈ దాడిని ఎలాగైనా నివారించడానికి ఐక్యరాజ్యసమితి 193 సభ్య దేశాల అత్యవసర సమావేశం న్యూయార్క్‌లో సోమవారం జరిగింది.