మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాలన్నింటిలో శివనామస్మరణ మార్మోగుతోంది. మంగళవారం మహాశివరాత్రిని పురస్కరించుకొని శైవాలయాలను అధికారులు అందంగా ముస్తాబుచేశారు. వేడుకలను అంగరంగ వైభవంగా జరిపేందుకు ఆలయాల్లో అన్ని ఏర్పాట్లను దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో చేపట్టారు. మంగళవారం తెల్లవారుజాము నుంచే ఆలయాల్లో ప్రత్యేక పూజలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో శైవాలయాలల్లో భక్తుల రద్దీకి తగ్గట్టుగానే ఆలయాల నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలోని శైవాలయాలు మహాశివరాత్రి శోభను సంతరించుకున్నాయి.
రాజన్న గుడిలో శివరాత్రి సంబురం..
ప్రసిద్ధ శైవక్షేత్రం వేములవాడ రాజన్న సన్నిధి మహా జాతరకు ముస్తాబయ్యింది. వేములవాడ పరిసర ప్రాంతాల్లో మహాశివరాత్రి సందడి కనిపిస్తోంది. ఆలయ దారి వెంట ప్రత్యేక అలంకరణలు, స్వాగత తోరణాలు ఆకట్టుకుంటున్నాయి. విద్యుత్ దీపాలంకరణలో రాజన్న కోవెల దేదీప్యమానంగా వెలిగిపోతోంది. మూడు రోజుల పాటు జరగనున్న జాతరను వైభవంగా నిర్వహించేందుకు అధికారులు సర్వం సిద్ధం చేశారు.
ఈ క్షేత్రంలో సోమవారం నుంచి మార్చి రెండవ తేదీ వరకు మహాశివరాత్రి మహోత్సవాలు వైభవంగా జరగనున్నాయి. జాతరకు రాష్ట్రంతో పాటు పొరుగు రాష్ట్రాల నుంచి రెండు లక్షల మంది భక్తులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. భక్తులకు ఇబ్బంది లేకుండా రూ. 2 కోట్లతో ఏర్పాట్లు చేపట్టారు. ఇప్పటికే ఆలయాన్ని రంగురంగుల విద్యుత్ దీపాలతో అధికారులు అలంకరించారు. వేములవాడకు చేరుకునే 5 ప్రధాన రహదారుల్లో భక్తులకు స్వాగతం పలికేలా భారీ స్వాగత తోరణాలను దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు.
స్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పించనున్న మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
రూ.100తో కోడె మొక్కులు, రూ.200తో స్పెషల్ కోడె మొక్కులను ఈ ఆలయంలో తీర్చుకోవచ్చు. మార్చి ఒకటిన ఉదయం 7 గంటలకు తిరుమల తిరుపతి దేవస్థానం పక్షాన అక్కడి అర్చకుల ప్రత్యేక బృందం, 8 గంటలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రభుత్వ ప్రతినిధిగా రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి వేములవాడ రాజన్నకు పట్టువస్త్రాలు సమర్పిస్తారు.
సిద్ధమైన వేయిస్తంభాల గుడి..
హనుమకొండలోని వేయి స్తంభాల ఆలయం వేడుకలకు సిద్ధమైంది. భక్తుల కోసం ప్రత్యేకఏర్పాట్లు చేశారు. ఎండవేడి తగలకుండా చలువ పందిళ్లు వేశారు. తెల్లవారుజాము నుంచే జాతర ప్రారంభం అవుతుందని అర్చకులు తెలిపారు.
ఐనవోలులో ఉత్సవాలు..
ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఐనవోలు శ్రీ మల్లికార్జున స్వామి ఆలయంలో శివరాత్రి ఉత్సవాలు వైభవంగా జరగనున్నాయి. శివరాత్రిని పురస్కరించుకొని ఐదురోజులు భక్తిశ్రద్ధలతో ఉత్సవాలను నిర్వహించనున్నారు. ఒగ్గు పూజారులు వేసే పెద్ద పట్నం చూసేందుకు భక్తులు పెద్దసంఖ్యలో హాజరుకానున్నారు.
కాళేశ్వర ముక్తీశ్వరస్వామి ఆలయంలో….
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయాన్ని అందంగా అలంకరించారు. జాతరలో భాగంగా ప్రత్యేక కార్యక్రమాలు మొదలయ్యాయి. అగ్నిప్రతిష్ట, రుద్రహవనం, ఊరేగింపు, ఎదురు కోలు సేవ కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
ముస్తాబైన ఝరాసంఘం ఆలయం..
సంగారెడ్డి జిల్లా ఝరాసంఘం కేతకీ సంగమేశ్వర ఆలయంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించనున్నారు. ఈ ఉత్సవాల్లో భాగంగా ప్రభుత్వం తరఫున సంగమేశ్వరుడుకి మంత్రి హరీష్ రావు పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. సంగారెడ్డిలోని జ్యోతిర్వాస్తు విద్యా పీఠం ఆధ్వర్యంలో ప్రకృతి ప్రతిరూపమైన పరమశివుడిని పత్రాలతో మహా శివలింగంగా తీర్చిదిద్దారు. 220కిపైగా ఔషధ వృక్షాల నుంచి సేకరించిన 18కోట్ల ఆకులతో, 18 అడుగుల మహా శివలింగాన్ని తయారు చేశారు.
హైదరాబాద్ శివారులోని బీరంగూడ….
హైదరాబాద్ శివారులోని బీరంగూడ శ్రీ భ్రమరాంబికా మల్లికార్జున స్వామి ఆలయంలో మార్చి 4వ తేదీ వరకు జరిగే శివరాత్రి వేడుకల కోసం ఆలయాన్ని సుందరంగా ముస్తాబు చేశారు.
భారీగా కీసరగుట్టకు భక్తులు
రంగారెడ్డి జిల్లాలోని కీసరగుట్ట క్షేత్రాన్ని మహాశివరాత్రి వేడుకల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే వివిధ జిల్లాలు, రాష్టాల నుంచి కీసరగుట్ట భారీగా భక్తులు తరలివచ్చారు.
మేళ్లచెరువు ముస్తాబు..
సూర్యాపేట జిల్లాలోని మేళ్లచెరువు మహాశివరాత్రిని పురస్కరించుకొని ఇక్కడ జాతరను నిర్వహించనున్నారు. మార్చి 1వ తేదీ నుంచి ఐదు రోజుల వరకు జరగనున్న ఈ జాతరకు ఐదు లక్షల మంది భక్తులు వచ్చే అవకాశమున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.
శివరాత్రి వేడుకలకు ఈస్గాం సిద్ధం..
కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ మండలంలోని ఈస్గాం మల్లన్న స్వామి ఆలయంలో శివరాత్రి ఉత్సవాల కోసం అధికారులు ఏర్పాట్లు చేశారు. మూడురోజుల పాటు జరగనున్న ఈ జాతరకు వెళ్లే భక్తుల కోసం టిఎస్ ఆర్టీసి సైతం 15 ప్రత్యేక బస్సులను నడిపిస్తోంది. పెద్దఎత్తున భక్తులు తరలివచ్చే అవకాశమున్నందున ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు.