రష్యన్ సైనికుడి చివరి సందేశం
ఐరాసలో చదివి వినిపించిన ఉక్రెయిన్ రాయబారి
కీవ్ : ‘మామ్.. నేను ఉక్రెయిన్‌లో ఉన్నా. నాకు చాలాభయంగా ఉంది. ఈ యుద్దం చాలా కష్టంగా ఉంది. మేం పౌరులను కూడా లక్షంగా చేసుకోవాల్సి వస్తోంది’ అని ఉక్రెయిన్ పై యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన ఓ రష్యన్ సైనికుడు తన తల్లికి పంపిన చివరి సందేశం ఇది. ఉక్రెయిన్‌పై దండయాత్ర సాగిస్తోన్న రష్యా కూడా భారీ మూల్యం చెల్లించుకుంటోందిఅనడానికి ఇదే నిదర్శనం. యుద్ధంతో ఉక్రెయిన్‌ను తమ అధీనం లోకి తెచ్చుకోవాలని ప్రయత్నిస్తోన్న రష్యా వేలాది మంది సొంత సైనికులను కూడా పోగొట్టుకుంటోంది. ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్య క్రమంలో ఐక్యరాజ్యసమితి (ఐరాస) సాధారణ సభ సోమవారం అత్యవసరంగా ప్రత్యేక సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో ఐరాసకు ఉక్రెయిన్ రాయబారి సెర్గీ కిస్లెత్సా మాట్లాడుతూ రష్యా దురాక్రమణను ఎండగట్టారు. ఈ సందర్భంగా యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన ఓ రష్యన్ సైనికుడు తన తల్లికి చివరిసారిగా పంపిన సందేశాన్ని సెర్గీ చదివి వినిపించారు. ఆ సైనికుడి ఫోన్ నుంచి ఈ మెసేజ్‌ను సేకరించినట్టు సెర్గీ వెల్లడించారు.
సెర్గీ చెప్పిన ఆ తల్లీ కొడుకుల సంభాషణ ఇలా ఉంది….
సైనికుడి తల్లి : ఎక్కడున్నావ్ నాన్నా…? నేను నీకు ఒక పార్శిల్ పంపాలి.
రష్యన్ సైనికుడు : నాకు ఉరేసుకుని చచ్చిపోవాలని ఉంది మామ్.
తల్లి: ఏం మాట్లాడుతున్నావ్ …? ఏం జరిగింది?
సైనికుడు : మామ్ నేను ఉక్రెయిన్‌లో ఉన్నా,ఇక్కడ నిజమైన యుద్ధం జరుగుతోంది. నాకు చాలా భయంగా ఉంది. మేం అన్ని నగరాల పైనా బాంబులు విసురుతున్నాం. పౌరులను కూడా లక్షంగా చేసుకుంటున్నాం. వారు (ఉక్రెయిన్ వాసులు) మమ్మల్ని స్వాగతిస్తారని మా అధికారులు చెప్పారు. కానీ వారు (ఉక్రెయిన్ సైనికులు ) మా సాయుధ వాహనాల కింద పడుతున్నారు. చక్రాలకు అడ్డుపడి మమ్మల్ని కదలనివ్వట్లేదు. మమ్మల్ని ఫాసిస్ట్‌లు అంటున్నారు. ఇది చాలా కష్టంగా ఉంది మామ్. ఇదే ఆ సైనికుడు తన తల్లికి , చనిపోయే ముందు పంపిన చివరి సందేశమని, ఆ తర్వాత ఉక్రెయిన్ జరిపిన ప్రతిదాడిలో ఆ రష్యన్ సైనికుడు మరణించాడని సెర్గీ ఐరాస వేదికపై తెలిపారు. పుతిన్ దురాక్రమణ కారణంగా వేలాది మంది రష్యన్ సైనికులు కూడా ప్రాణాలు కోల్పోతున్నారని , ఇప్పటికైనా ఈ దారుణాలని ఆపాలని ప్రపంచ వేదికపై సెర్గీ అభ్యర్థించారు.