భక్తులతో కిటకిటలాడిన శైవక్షేత్రాలు
ఉదయం దీక్షలు,సాయంత్రం విరమణలు
హైదరాబాద్: శివ నామ స్మరణతో హైదరాబాద్ మహానగరం మారుమోగింది. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా నగరంలోని శివాలయాలల్లో తెల్లవారు జామునే వేద పండితులు మహాదేవుడికి ప్రత్యేక అర్చనలు, కుంకుమార్చనలు, అభిషేకాలు, ఏకదశ రుద్రాభిషేకాలు, రుద్రహోమాలు, శివ పార్వతుల కళ్యాణోత్సవాలు, లింగోధ్భవ మహా రుద్రభిషేకాలు నిర్వహించారు. కోవిడ్ మహామ్మారి ఈ ఏడాది పూర్తిగా తగ్గుముఖం పట్టడంతోపరమ శివుడి దర్శనానికి భక్తుల పొటెత్తడంతో శైవ క్షేత్రాలన్ని కిటకిటలాడాయి. నగర వాసులు తెల్లవారు జామునే పుణ్య స్నానాలు ఆచరించి ఉపవాస దీక్షలు చేపట్టారు. సాయంత్రం శివుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి దీక్షను విరమించారు. సాయంత్రం ఉపవాస దీక్ష విరమణకు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఆలయ కమిటీలు ప్రత్యేక ఏర్పాటు చేశారు. అదేవిధంగా భక్తి పరవశంతో ఉత్సవమూర్తుల ఊరేగింపులు నిర్వహించారు.
జాగారణ సందర్భంగా ఆలయాల్లో సంస్కృతిక కార్యక్రమాలతో పాటు భజనలను ఏర్పాటు చేశారు. కాచిగూడ వీరన్న గుట్ట శ్యాంమందిర్‌లోని శివాలయం, పాతబస్తీ శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి, పురానా పూల్ శివాలాల్ ఘాట్, చార్మీనార్ మహాదేవ్ మందిరం భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామిని దర్శించుకున్నారు. శంకర్‌మట్‌లోని శివాలయానికి భక్తులు పొటెత్తారు. దిల్‌సుఖ్‌నగర్, నారాయణగూడ, సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లోని శివాలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్పటిక లింగ క్షేత్రమైన నాగోల్ సమీపంలోని శివపురిలోని కాశీ విశ్వేశ్వరాలయం ప్రత్యేక పూజలు నిర్వహించారు. సికింద్రాబాద్ పద్మారావు నగర్‌లోని స్కంధగరి ఆలయలం, మారేడ్‌పల్లిలోని సుబ్రమణ్యం దేవాలయ ప్రాంగణంలోని శివాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సనత్ నగర్‌లోని హనుమాన్ ఆలయ ప్రాంగణంలోని భ్రమరాంబిక సమేత మల్లికార్జున దేవాలయంలో స్వామివారికి ప్రత్యేక అర్చనలు, పూజలు నిర్వహించారు.
కీసరగుట్టకు పొటేత్తిన నగరవాసులు
ప్రసిద్ది శైవ క్షేత్రమైన కీసరగుట్టలోని రామలింగేశ్వర స్వామి దర్శనానికి నగర వాసులు భారీగా తరలివెళ్లారు. స్వామివారిని దర్శించుకుని అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించారు. నగరానికి అతీ సమీపంలో ఉండడమే కాకుండా ఎత్తైన గుట్టపై కొలువుదీరిన రామలింగేశ్వర స్వామితో పాటు గుట్టపై ఎక్కడ చూసిన శివలింగాలే దర్శమివ్వడం ఇక్కడి ప్రత్యేకథ. దీంతో నగరవాసులు భారీగా తరలి వెళ్లి అక్కడ శివలింగాలకు క్షీరాభిషేకాలు నిర్వహించి పరమశివుడి మొక్కులను తీర్చుకున్నారు. బుధవారం ఉపవాస దీక్షల అనంతరం నగరవాసులు మరింత భారీ సంఖ్యలో స్వామిని దర్శించుకోనున్నారు. వేములవాడ రాజ రాజేశ్వరి దేవాలయంలో పాటు కాళేశ్వరంలోని శివుడి దర్శనానికి సైతం భాగ్యనగర వాసులు పెద్ద సంఖ్యలో తరలి వెళ్లారు. మహా శివరాత్రి సందర్భంగా శ్రీశైలం మల్లికార్డున స్వామి దర్శనానికి సైతం నగరవాసులు భారీగా తరలి వెళ్లారు.