ఉక్రెయిన్ సంక్షోభంపై వివరణ
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం నాడిక్కడ రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్‌తో సమావేశమై ఉక్రెయిన్ సంక్షోభంతోపాటు వివిధ అంశాల గురించి వివరించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. రష్యా సైనిక దాడితో సంక్షోభంలో చిక్కుకున్న ఉక్రెయిన్ నుంచి భారతీయులను ముఖ్యంగా విద్యార్థులను స్వదేశానికి తరలించేందుకు భారత ప్రభుత్వం ఆపరేషన్ గంగ పథకాన్ని ప్రారంభించింది. ఉక్రెయిన్‌లో నెలకొన్న పరిస్థితులను రాష్ట్రపతికి వివరించిన ప్రధాని మోడీ ఆ దేశంలో చిక్కుకున్న భారతీయులను వెనక్కు రప్పించేందుకు తమ ప్రభుత్వం చేపట్టిన చర్యలను తెలియచేసినట్లు వర్గాలు తెలిపాయి. భారతీయుల తరలింపు ప్రక్రియను పర్యవేక్షించేందుకు నలుగురు కేంద్ర మంత్రులను ఉక్రెయిన్ పొరుగు దేశాలకు పంపించాలని సోమవారం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కూడా ప్రధాని మోడీ రాష్ట్రపతికి వివరించినట్లు వర్గాలు తెలిపాయి.
రాష్ట్రపతితో జైశంకర్ భేటీ
విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్ జైశంకర్ రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్‌తో సమావేశమై ఉక్రెయిన్ నుంచి భారతీయుల తరలింపు వివరాలను తెలియచేశారు. రాష్ట్రపతి కోవింద్‌ను జైశంకర్ సోమవారం రాత్రి కలుసుకుని ఆపరేషన్ గంగ ద్వారా ఉక్రెయిన్ నుంచి భారతీయులను తరలించడానికి చేస్తున్న ప్రయత్నాలను వివరించినట్లు రాష్ట్రపతి కార్యాలయం ట్వీట్ చేసింది.