ఏప్రిల్ 16 నుంచి 21 వరకు మొదటి సెషన్
మే 24 నుంచి 29 వరకు రెండో విడత
31 వరకు దరఖాస్తుల స్వీకరణ
హైదరాబాద్ : దేశంలో ప్రతిష్టాత్మక ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ), నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్‌ఐటీ) తదితర విద్యా సంస్థలలో ప్రవేశానికి నిర్వహించే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జెఇఇ) మెయిన్ -2022 పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. ఈసారి రెండు సార్లు జెఇఇ మెయిన్ నిర్వహించనున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్‌టిఎ) వెల్లడించింది. ఏప్రిల్ 16 నుంచి 21 వరకు మొదటి విడత, మే 24 నుంచి 29 వరకు రెండో విడత జెఇఇ మెయిన్ పరీక్షలు జరుగనున్నాయి. మంగళవారం(మార్చి 1) నుంచి ఈ నెల 31 వరకు జెఇఇ మెయిన్ దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ఎన్‌టిఎ తెలిపింది. జూలై 3న జెఇఇ అడ్వాన్స్‌కు పరీక్ష జరుగనుంది.
2021లో నాలుగు విడతల్లో జెఇఇ మెయిన్
గత ఏడాది(2021) కొవిడ్ సెకండ్ వేవ్ పరిస్థితుల దృష్టా విద్యార్థుల సౌలభ్యం కోసం నాలుగు విడతలుగా జెఇఇ మెయిన్ నిర్వహించారు. అయితే ప్రస్తుతం కరోనా ప్రభావం తగ్గి సాధారణ పరిస్థితి నెలకొనటం, ప్రత్యక్ష తరగతులు జరుగుతున్నందున ఈసారి రెండుసార్లు నిర్వహించాలని ఎన్‌టిఎ నిర్ణయించింది. గతేడాది నాలుగు నిర్వహించినా విద్యార్థులు పెద్దగా వినియోగించుకోలేదు. దరఖాస్తు చేసిన వారిలో 27 శాతం మంది మాత్రమే నాలుగు విడతల్లో పరీక్షలకు హాజరయ్యారు. 2019, 2020లో జెఇఇ మెయిన్‌ను రెండు విడతలుగా నిర్వహించారు. ఈసారి కూడా గతంలో మాదిరిగానే రెండు సార్లు నిర్వహించాలని నిర్ణయించి ఆ మేరకు ఎన్‌టిఎ షెడ్యూల్ విడుదల చేసింది.
ఈసారి అభ్యర్థులు పెరిగే అవకాశం
జెఇఇ మెయిన్ అభ్యర్థుల సంఖ్య ఈసారి పెరిగే అవకాశం కనిపిస్తోంది. రెండేళ్లుగా ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణ అస్తవ్యస్తంగా మారిన నేపథ్యంలో కొన్ని రాష్ట్రాల్లో పరీక్షలు అరకొరగా జరగ్గా అనేక రాష్ట్రాల్లో అసలు పరీక్షలే జరగలేదు. దాదాపు అన్ని రాష్ట్రాల్లో కూడా విద్యార్థులందరినీ పాస్ చేశారు. సిబిఎస్‌ఇ కూడా కరోనా కారణంగా చదువులు దెబ్బతినడంతో మూల్యాంకనాన్ని సరళతరం చేసింది. ఆ సంస్థల్లోనూ 99 శాతం వరకు విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఫలితంగా ఈసారి జెఇఇ మెయిన్‌కి విద్యార్థుల సంఖ్య పెరిగే అవకాశముంది.