Saturday, November 23, 2024

సమస్యలు వదిలి….ఒకరిపై ఒకరు ఆరోపణలు

- Advertisement -
- Advertisement -

సమస్యలు వదిలి….ఒకరిపై ఒకరు ఆరోపణలు
ఆర్టీసి కార్మిక సంఘాల్లో కోల్డ్ వార్ !
శృతిమించి పోతున్న జేఏసి నేతల విమర్శలు
వ్యక్తిగత విషయాలు వాట్సాప్ గ్రూప్‌ల్లో షేర్
విమర్శలు వదిలి సమస్యలపై కదలండి: కార్మికుల విజ్ఞప్తి


మనతెలంగాణ/హైదరాబాద్:  కొన్ని రోజుల వరకు స్తబ్ధుగా ఉన్న ఆర్టీసి కార్మిక సంఘాల్లో కోల్డ్ వార్ మొదలయ్యింది. టిఎంయూ గౌరవ అధ్యక్షుడిగా అశ్వథామరెడ్డి ఎన్నికైనప్పటి నుంచి కార్మిక సంఘాల్లో ముసలం మొదలయ్యింది. సమస్యలపై నిలదీయాల్సిన సంఘాల నాయకులు ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకోవడానికి తమ సమయాన్ని వెచ్చిస్తున్నాయని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమస్యల పరిష్కారానికి ఎలా ముందుకు వెళ్లాలన్న దానిపై కార్మికులతో చర్చించకుండా నాయకులే ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారని కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

వెల్ఫేర్ బోర్డుల ఏర్పాటుతో సంఘాల సైలెంట్ ప్రప్రత్యేక తెలంగాణ ఉద్యమం తరువాత ఆర్టీసి కార్మిక సంఘాలు మళ్లీ వెలుగులోకి వచ్చాయి. కానీ ఆర్టీసి కార్మికుల సమస్యల పరిష్కారం కంటే ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకోవడానికే వారికి సరిపోతుందని కార్మికులు ఆవేదన చెందుతున్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో, కార్మిక డిమాండ్ల సాధన కోసం చేసిన సమ్మె సందర్భంలోనూ కార్మిక సంఘాలు ఐక్యతను చాటడడంతో పాటు ఆర్టీసి చరిత్రలో 55 రోజుల సమ్మె చేసి ఆర్టీసి యాజమాన్యానికి ఈ సంఘాల నాయకులు తమ ఐక్యతను తెలియచేశారు. ఈ నేపథ్యంలోనే ఆర్టీసిలో కార్మిక సంఘాల స్థానంలో వెల్ఫేర్ బోర్డులను ఆర్టీసి యాజమాన్యం ఏర్పాటు చేసింది. కార్మికులు పని ప్రదేశాల్లో కానీ, ఇతర ప్రాంతాల్లో ఏదైనా ఇబ్బందులకు గురైతే వెల్ఫేర్ బోర్డుల ద్వారా సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని ఆర్టీసి యాజమాన్యం గతంలో స్పష్టం చేసింది. ఈ దెబ్బతో సంస్థలో పని చేస్తున్న కార్మిక సంఘాలు సైలెంట్ అయిపోయారు.

కొన్ని రోజులుగా స్తబ్ధుగా ఉన్న కార్మిక సంఘాలు

ఈ నేపథ్యంలోనే కొన్ని రోజులుగా స్తబ్ధుగా ఉన్న కార్మిక సంఘాలు కలిసి జెఏసిగా ఏర్పాటు అయ్యాయి. అయితే ఈ జేఏసిలో తెలంగాణ ఆర్టీసి మజ్దూర్ యూనియన్, టిఎంయూ, ఈయూలోని కార్మిక సంఘాల నాయకులు కార్మికుల కోసం తామే పని చేస్తున్నామని ఎవరికీ వారు ప్రకటించుకోవడంతో పాటు జేఏసిలో చేరని సంఘాలపై కామెంట్స్ చేస్తూ కాలం వెళ్లదీస్తున్నారు. గతంలో జరిగిన సమ్మెలో ఫలానా సంఘం కార్మిక ద్రోహిగా వ్యవహారించిందని, ఫలానా కార్మిక సంఘం నాయకుడు ఒంటెద్దు నిర్ణయాలు తీసుకున్నారని ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పిస్తున్నారు. ఇంతటితో ఆగకుండా టిఎంయూలోని రెండు వర్గాలపై జేఏసి నేతల విమర్శలు శృతిమించి పోతున్నాయి. కార్మిక సంఘాల నాయకులు వ్యక్తిగత విషయాలను వాట్సాప్ గ్రూప్‌లలో పంపిస్తూ ఆనంద పడుతున్నారని కార్మికులు పేర్కొంటున్నారు. ఇలా ఒకరిపై ఒకరు కామెంట్స్ చేసుకోవడం కన్నా కార్మికుల సమస్యలపై స్పందిస్తే బాగుంటుందని కార్మికులు సూచిస్తున్నారు. కార్మిక సంఘాల జేఏసి బయట ఉన్న రెండు వర్గాలు కూడా యూనియన్ మాదంటే మాదని గొడవలు దిగుతున్నారని కార్మికులు ఆరోపిస్తున్నారు. ఒక వర్గం ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేస్తుంటే మరోవర్గం ఆర్టీసి యాజమాన్యం తీసుకుంటున్న నిర్ణయాలతో పాటు ప్రభుత్వ పెద్దలపై ఆరోపణలు చేస్తూ పబ్బం గడుపుతోంది. ఇదే తప్పును ఆర్టీసి సమ్మె సమయంలో కార్మిక సంఘాల నాయకులు చేసి ముఖ్యమంత్రి ఆగ్రహానికి గురయ్యారని కార్మికులు వాపోతున్నారు.

మళ్లీ ఎన్నికల పేరుతో రచ్చ

ఆర్టీసిలో సమ్మె ముగిసి రెండు సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడిప్పుడే ఆర్టీసి గాడిలో పడుతుందనుకున్న సమయంలో మళ్లీ ఎన్నికల పేరుతో రచ్చకు పలు యూనియన్లు సిద్ధమయ్యాయని బస్ భవన్ వర్గాలు సైతం ఆరోపిస్తున్నాయి. అందులో భాగంగానే ఆర్టీసి కార్మిక సంఘం కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వచ్చిన ఓ నాయకుడు మళ్లీ యూనియన్‌లో కీలకంగా వ్యవహారించేందుకు అందులో చేరారని ప్రస్తుతం కార్మికులు పేర్కొంటున్నారు. ఈనేపథ్యంలో కార్మిక సంఘాలు కార్మిక సమస్యల పరిష్కారాన్ని పక్కన పెట్టి సొంత ఎజెండా ముందుకు పెట్టే ప్రయత్నాలను కార్మికులు ఆసహ్యించుకుంటున్నారు. ఇప్పటికైనా కార్మికుల సమస్యలపై సంఘాల నాయకులు స్పందించాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News