న్యూఢిల్లీ: ఉక్రెయిన్‌నుంచి ఖాళీ చేసిన దాదాపు 800 మంది భారతీయులతో భారత వైమానిక దళానికి చెందిన నాలుగు సి17 విమానాలు గురువారం ఇక్కడికి సమీపంలోని హిండన్ ఎయిర్‌బేస్‌కు చేరుకుంటాయని సంబంధిత వర్గాలు తెలియజేశాయి. రష్యా మిలిటరీ దాడుల కారణంగా గత నెల 24న ఉక్రెయిన్ గగనతలాన్ని మూసి వేయడంతో అక్కడ చిక్కుకు పోయిన భారతీయులను కేంద్రం రొమేనియా, హంగరీ, పోలండ్ తదితర ఉక్రెయిన్ పొరుగు దేశాలనుంచి విమానాల్లో స్వదేశానికి తీసుకు వస్తున్న విషయం తెలిసిందే. భారత వైమానిక దళానికి చెందిన విమానాలు కూడా ఈ దేశాలనుంచే వస్తున్నట్లు ఆ వర్గాలు తెలియజేశాయి. గురువారం తెల్లవారు జామున 1.30నుంచి 8 గంటల మధ్యలో దాదాపు 800 మంది భారతీయులను తీసుకుని ఈ నాలుగు వైమానిక దళ విమానాలు హిండన్ ఎయిర్‌బేస్‌లో ల్యాండ్ అవుతాయని ఆ వర్గాలు తెలిపాయి. రక్షణ శాఖ సమాయమంత్రి అజయ్ భట్ వారికి ఎయిర్‌బేస్ వద్ద స్వాగతం పలుకుతారని తెలిపారు.