Saturday, December 21, 2024

మహిళల విశ్వ సమరానికి సర్వం సిద్ధం!

- Advertisement -
- Advertisement -

రేపటి నుంచే ఉమెన్స్ వన్డే ప్రపంచకప్


మౌంట్‌మాంగనూయి: మహిళల వన్డే ప్రపంచకప్‌కు సర్వం సిద్ధమైంది. న్యూజిలాండ్ వేదికగా శుక్రవారం నుంచి విశ్వకప్ సమరం జరుగనుంది. ఈ టోర్నమెంట్‌లో మొత్తం 8 జట్లు పోటీ పడుతున్నాయి. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, భారత్, పాకిస్థాన్, బంగ్లాదేశ్, వెస్టిండీస్, సౌతాఫ్రికా జట్లు టోర్నీలో పాల్గొంటున్నాయి. మార్చి 4న ప్రారంభమయ్యే విశ్వకప్‌కు ఏప్రిల్ 3న క్రైస్ట్‌చర్చ్ వేదికగా జరిగే ఫైనల్‌తో తలపడుతోంది. ఈసారి ఆరు వేదికల్లో ప్రపంచకప్ పోటీలను నిర్వహిస్తున్నారు. ఇక టోర్నీలో ఎప్పటిలాగే ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ జట్లు ఫేవరెట్లుగా బరిలోకి దిగుతున్నాయి. డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్, మాజీ విజేత ఆస్ట్రేలియాలతో పాటు ఆతిథ్య న్యూజిలాండ్, కిందటి రన్నరప్ టీమిండియా కూడా ట్రోఫీ సాధించడమే లక్షంగా పోరుకు సిద్ధమయ్యాయి. ఇక సౌతాఫ్రికా, విండీస్‌లను కూడా తక్కువ అంచనా వేయలేం.

భారీ ఆశలతో మిథాలీ సేన..

మరోవైపు భారత మహిళా జట్టు ఈ టోర్నమెంట్‌ను ప్రతిష్టాత్మకంగా తీసుకొంది. సుదీర్ఘ కాలంగా టీమిండియాకు ప్రాతినిథ్యం వహిస్తున్న మిథాలీ రాజ్ ఈ ప్రపంచకప్ తర్వాత ఆటకు వీడ్కోలు పలకాలని నిర్ణయించింది. మరో సీనియర్ జులన్ గోస్వామికి కూడా ఇదే చివరి వరల్డ్‌కప్. దీంతో తమ సీనియర్లకు ప్రపంచకప్ ట్రోఫీతో వీడ్కోలు పలకాలనే పట్టుదలతో యువ క్రికెటర్లు ఉన్నారు. డాషింగ్ ఓపెనర్ స్మృతి మంధాన అద్భుత ఫామ్‌లో ఉండడం టీమిండియాకు అతి పెద్ద ఊరటగా చెప్పొచ్చు. దక్షిణాఫ్రికాతో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్‌లో మంధాన తలకు తీవ్ర గాయమైంది. అలాంటి స్థితిలో మంధాన ప్రపంచకప్‌లో పాల్గొనడంపై అనుమానలు తలెత్తాయి. అయితే తాజాగా నిర్వహించిన వైద్య పరీక్షల్లో గాయం తీవ్రత పెద్దగా లేదని, మంధాన వరల్డ్‌కప్‌లో పాల్గొనవచ్చని వైద్యులు స్పష్టం చేశారు. దీంతో టీమిండియా ఊపిరి పీల్చుకుంది. ఇక కెప్టెన్ మిథాలీతో పాటు దీప్తి శర్మ, హర్మన్‌ప్రీత్ కౌర్, షఫాలీ వర్మ, యస్తిక భాటియా, రిచా ఘోష్, పూజా వస్త్రాకర్, స్నేహ్ రాణా, గోస్వామి, రాజేశ్వరి తదితరులతో టీమిండియా చాలా బలంగా ఉంది. సమష్టిగా రాణిస్తే ఈసారి విశ్వకప్‌ను సాధించడం మిథాలీ సేనకు అసాధ్యమేమీ కాదు.

మూడు జట్ల మధ్యే..

 

కాగా, ఈసారి ప్రపంచకప్‌లో మూడు జట్ల మధ్య ప్రధాన పోటీ నెలకొంది. డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్, మాజీ విజేతలు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్లకు ప్రపంచకప్ గెలుచుకునే అవకాశాలు అధికంగా ఉన్నాయి. ప్రపంచ క్రికెట్‌లో ప్రస్తుతం ఈ జట్ల ఆధిపత్యమే నడుస్తోంది. ఇక మహిళల వరల్డ్‌కప్‌లో ఇప్పటి వరకు ఈ మూడు జట్లే ట్రోఫీలు సాధించాయి. ఆస్ట్రేలియా అత్యధిక సంఖ్యలో ఆరుసార్లు ప్రపంచకప్ ట్రోఫీని గెలుచుకుంది. ఇంగ్లండ్ నాలుగు సార్లు ప్రపంచ చాంపియన్‌గా నిలిచింది. న్యూజిలాండ్ ఒక సారి వరల్డ్‌కప్ ట్రోఫీని సొంతం చేసుకుంది. అంతేగాక మూడుసార్లు రన్నరప్‌గా నిలిచింది. ఈసారి సొంత గడ్డపై ట్రోఫీ జరుగుతుండడం న్యూజిలాండ్‌కు సానుకూల పరిణామంగా మారింది. అయితే బలమైన ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌లను వెనక్కినెట్టి ట్రోఫీని గెలవడం కివీస్‌కు అంత తేలికేం కాదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక రెండు సార్లు రన్నరప్‌తోనే సరిపెట్టుకున్న టీమిండియా ఈసారి ట్రోఫీని సాధించాలనే లక్షంతో కనిపిస్తోంది. బంగ్లాదేశ్, విండీస్, సౌతాఫ్రికా, పాకిస్థాన్‌లు బరిలో ఉన్నా ట్రోఫీ సాధించడం దాదాపు అసాధ్యమనే చెప్పాలి. ఇక ఈసారి చిరకాల ప్రత్యర్థులు భారత్‌ పాకిస్థాన్, ఆస్ట్రేలియాఇంగ్లండ్ జట్ల మధ్య జరిగే మ్యాచ్‌లకు ప్రాధాన్యత నెలకొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News