వారణాసి: ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఉక్రెయిన్‌లో భారతీయులు అల్లాడుతుండగా ప్రధాని నరేంద్ర మోడీ మాత్రం ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచార సభలతో బిజీగా ఉన్నారని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపించారు. యుపి ఎన్నికల్లో సమాజ్‌వాది పార్టీ తరఫున ఎన్నిక ప్రచారంలో పాల్గొన్న మమత గురువారం నాడిక్కడ ఒక ఎన్నికల ర్యాలీనుద్దేశించి ప్రసంగిస్తూ యుద్ధంతో భీతిల్లుతున్న ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయులను కేంద్ర ప్రభుత్వం వారి కర్మకు వారిని వదిలివేసిందని కూడా ఆరోపించారు. ఇప్పుడేం జరుగుతున్నదో చూడండి. ఉక్రెయిన్‌లో యుద్ధం జరుగుతుంటే మోడీ ఇక్కడ(రాష్ట్రంలో) ఎన్నికల సభలు నిర్వహిస్తున్నారు.
ఏది ముఖ్యం అసలు? భారతీయు విద్యార్థులను వాపసు తీసుకురావడం ముఖ్యం కాదా? అంటూ మమత ప్రశ్నించారు. రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో మీకు(మోడీ) అంత సత్సంబంధాలే ఉంటే..యుద్ధం జరుగుతుందని మూడు నెలల ముందే మీకు తెలిసి ఉంటే..అక్కడి(ఉక్రెయిన్‌లోని) భారతీయులను ఎందుకు తీసుకురాలేదు అంటూ మోడీని మమత నిలదీశారు. ప్రధాని మోడీ సొంత పార్లమెంటరీ నియోజకవర్గమైన వారణాసిలో అఖిలేష్ యాదవ్ సారథ్యంలోని సమాజ్‌వాది పార్టీ తరఫున ప్రచారం నిర్వహిస్తున్న మమత ఉక్రెయిన్‌లోని భారతీయులు సొంతంగా వాపసు వచేయాలంటూ కేంద్రం సలహాలు ఇస్తోందని మండిపడ్డారు.