ప్రజల ఫిర్యాదులను వేగంగా పరిష్కరించాలి
జలమండలి అధికారులతో ఎండీ దానకిషోర్
మన తెలంగాణ,సిటీబ్యూరో: నగరంలో రానున్న వేసవిలో తాగునీటి సరఫరాకు ఎలాంటి ఇబ్బంది ఉండదని జలమండలి ఎండీ దానకిషోర్ పేర్కొన్నారు. తాగునీరు, సీవరేజి,తదితర అంశాలపై ఓఅండ్‌ఎం అధికారులతో గురువాం ఖైరతాబాద్‌లోని జలమండలి ప్రధాన కార్యాలయంలో ఆయనసమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ వేసవి దృష్టా ప్రజలకు నీటి సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎక్కడైనా అవసరమైతే ఉచితంగా ట్యాంకర్ల ద్వారా నీటిని అందించేందుక ఏర్పాట్లు చేయాలన్నారు. అలాగే కలుషిత నీరు సరఫరా కాకుండా తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
లోప్రెషర్, టెయిల్ ఎండ్ ప్రాంతాలను గుర్తించి అవసరమైన మరమ్మత్తు పనులు వెంటనే చేపట్టాలని ఆదేశించారు. పవర్ బోర్‌వెల్స్ పనితీరును పరిశీలించి అవసరమైన చోట్ల మరమ్మత్తులు చేయించి ప్రజలకు అందుబాటులోకి తేవాలని పేర్కొన్నారు. సీవరేజీ నిర్వహణలో సమస్యలు రాకుండా చూడాలని, ప్రజల నుంచి వివిధ మాధ్యమాల ద్వారా వచ్చే ఫిర్యాదులను వేగంగా పరిష్కరించడానికి ప్రాధాన్యత ఇవ్వాలని పేర్కొన్నారు. సీవరేజి ఓవర్‌ప్లో నిరోధించడానికి ముందుస్తు నివారణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సీవరేజి పనుల్లో కార్మికులు రక్షణ పరికరాలు తప్పనిసరిగా వినియోగించేలా చూసుకోవాలని అధికారులకు సూచించారు. రిజర్వాయర్ల భద్రతకు సంబంధించి ఇప్పటికే అవసరమైన చోట్ల సెక్యూరిటీ సిబ్బందిని, అన్ని రిజర్వాయర్ల ప్రాంగణాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఈకార్యక్రమంలో టెక్నికల్ డైరెక్టర్ రవికుమార్, ఆపరేషన్స్ డైరెక్టర్లు ఆజ్మీరా కృష్ణ, స్వామి, సీజీఎంలు, జీఎంలు, తదితరులు పాల్గొన్నారు.