Monday, December 23, 2024

‘దేశి’ మిర్చి క్వింటాల్ రూ.32 వేలు

- Advertisement -
- Advertisement -

‘Desi’ chilli is Rs 32,000 per quintal in enumamula market

వరంగల్ ఎనుమాముల మార్కెట్‌లో రికార్డుస్థాయి ధర

మన తెలంగాణ/వరంగల్ కార్పొరేషన్ : రాష్ట్రంలో మిర్చి పంటకు మంచి రోజులు వచ్చినట్టు కన్పిస్తున్నాయి. వరంగల్ జిల్లాలో రైతన్నలు పండిస్తున్న మిర్చికి బయట మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉండటంతో ఊహించని విధంగా మంచి ధర దక్కుతోంది. వరంగల్ ఎనుమాముల మార్కెట్‌లో గురువారం గతంలో ఎన్నడూ లేనివిధంగా క్వింటాల దేశి మిర్చి రూ.32వేలు రికార్డు స్థాయి ధర పలికింది. ఆసియా ఖండంలోనే అతిపెద్ద వ్యవసాయ మార్కెట్లలో రెండవదైన ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ చరిత్రలోనే మిర్చికి ఇంతటి ధర ఎప్పడూ లభించలేదని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మిర్చికి ఇంత మంచి ధర లభించడంతో మిర్చి పంటను తీసుకువచ్చిన జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం కర్కెపల్లి గ్రామానికి చెందిన రైతు మునిగాల భిక్షపతిని మార్కెట్ యార్డు అధికారులు సత్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ మద్దతు ధర మార్కెట్ చరిత్రలోనే రికార్డు అని వ్యాపారులు సైతం చెబుతున్నారు. ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో ఎండు మిర్చికి అత్యధిక ధర పలుకుతుండడంతో ఫీజు (కమిషన్) రూపంలో సైతం మార్కెట్‌కు గణనీయమైన ఆదాయం వస్తుందంటున్నారు.

ఈ ఏడాది మిర్చికి అధిక డిమాండ్ ఉండడంతో ఎనుమాముల మార్కెట్‌కు తేజ, యుఎస్ 341, దేశి, దేవునూరు డిలక్స్(డిడి), వండర్‌హాట్, 1048, 334, తాలు రకం మిర్చి వస్తోంది. ఇన్ని రకాల మిర్చి వచ్చే మార్కెట్‌లలో తెలంగాణలోనే ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ మొదటిది. ఈ నేపథ్యంలోనే దేశి రకం మిర్చికి ఊహించని రీతిలో క్వింటాల్‌కు రూ.32 వేల ధర పలికింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం కర్కెపల్లి గ్రామానికి చెందిన మునిగాల భిక్షపతి అనే రైతు పది బస్తాల దేశి రకం మిర్చిని మార్కెట్‌కు తీసుకురాగా రూ.32వేల ధరతో కాకతీయ ట్రేడర్స్ అడ్తి ద్వారా లక్ష్మిసాయి ట్రేడర్స్ అత్యధిక ధరతో కొనుగోలు చేశారు. ఈ సందర్భంగా మార్కెట్ కమిటి చైర్‌పర్సన్ దిడ్డి భాగ్యలక్ష్మికుమారస్వామి, మార్కెట్ ఉన్నత శ్రేణి కార్యదర్శి బివి రాహుల్‌తో పాటు అధికారులు రైతు మునిగాల భిక్షపతిని ఘనంగా సన్మానించారు.

గణనీయంగా పెరిగిన మార్కెట్ ఆదాయం

ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో పంట ఉత్పత్తులకు అధిక ధర పలుకుతుండడంతో ఫీజు రూపంలో వచ్చే ఆదాయం సైతం గణనీయంగా పెరుగుతోంది. 2021-22 ఆర్థిక సంవత్సరం ఫీజు రూపంలో లక్షం రూ.28 కోట్లు కాగా, ఇప్పటికే రూ.32 కోట్లకుపైగా ఆదాయం సమకూరింది. ఇప్పటికే ఈ మార్కెట్‌కు 115 శాతంపైగా ఆదాయం సమకూరినట్లు అధికారులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News