Friday, November 22, 2024

పాక్ మసీదులో మానవ బాంబు పేలుడు

- Advertisement -
- Advertisement -
Human bomb blast at Pakistan mosque
56 మంది మృతి.. పలువురికి గాయాలు

పేషావర్: పాకిస్తాన్‌లోని పేషావర్‌లో శుక్రవారం షియా మసీదులో ప్రార్థనల సందర్భంగా భారీ పేలుడు సంభవించి 56 మంది మరణించగా పదుల సంఖ్యలో గాయపడ్డారు. అఫ్ఘానిస్తాన్‌కు సరిహద్దుల్లో ఉన్న పేషావర్‌లోని ఖిస్సా ఖ్వానీ బజార్‌లో ఉన్న జామియా మసీదులో ముస్లింలు శుక్రవారం ప్రార్థనలు చేస్తుండగా ఈ పేలుడు సంభవించింది. ఈ పేలుడుకు మానవ బాంబు కారణమని పోలీసులు తెలిపారు. మసీదులోకి ప్రవేశించిన హంతకుడు ప్రార్థనలు చేస్తున్న ఒక్కొక్కరిని పిస్టల్‌తో చంపుతూ తనను తాను బాంబుతో పేల్చుకుని చనిపోయాడని ఒక ప్రత్యక్ష సాక్షి తెలిపారు. తమ ఆసుపత్రికి 30 మృతదేహాలను తీసుకువచ్చారని లేడీ రీడింగ్ ఆసుపత్రి మీడియా మేనేజర్ ఆసిమ్ ఖాన్ తెలియచేశారు. ఈ దాడిలో 80 మందికి పైగా తీవ్రంగా గాయపడినట్లు ఖైబర్ ఫఖ్తున్‌ఖ్వా మంత్రి కమ్రాన్ బంగాష్ తెలిపారు.

ఇది మానవ బాంబు పనేనని పేషావర్ ఎస్‌ఎస్‌పి హరూన్ రషీద్ ఖాన్ వెల్లడించారు. బాంబు పేలుళ్లు సృష్టించేందుకు ఇద్దరు మసీదుకు వచ్చారని, వారిలో ఒకరు మానవ బాంబని ఆయన చెప్పారు. ఆసుపత్రిలో ఎమర్జెన్సీ విధించి సెలవులో ఉన్న డాక్టర్లను, ఇతర సిబ్బందిని వెంటనే రప్పించారు. మసీదులోకి ప్రవేశించేందుకు ఇద్దరు వ్యక్తులు ప్రయత్నించారని, అక్కడ విధులలో ఉన్న ఒక పోలీసులపై వారు కాల్పులు జరిపారని నగర పోలీసు అధికారి ఇజాజ్ అహసన్ తెలిపారు. కాల్పులలో ఒక పోలీసు మరణించా మరో పోలీసు గాయపడినట్లు ఆయన చెప్పారు. ఈ సంఘటన తర్వాతే మసీదులో పేలుడు సంభవించిందని ఆయన తెలిపారు. ఇలా ఉండగా..భద్రతా కారణాల దృష్టా పాక్‌లో అడుగుపెట్టని ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు మొదటిసారి 25 సంవత్సరాల తర్వాత ఇక్కడకు 190 కిలోమీటర్ల దూరంలోని రావల్‌పిండిలో పాక్‌తో టెస్ట్ మ్యాచ్ ఆడుతోంది. శుక్రవారమే క్రికెట్ మ్యాచ్ ప్రారంభం కావడం గమనార్హం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News