Sunday, December 22, 2024

షేన్ వార్న్ హఠాన్మరణం

- Advertisement -
- Advertisement -

గుండెపోటుతో ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం మృతి
ప్రపంచ క్రికెట్ దిగ్భ్రాంతి
ప్రముఖుల సంతాపం


మెల్‌బోర్న్: ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం షేన్ వార్న్ (52) శుక్రవారం హఠాన్మరణం చెందాడు. థాయిలాండ్‌లోని తన విల్లాలో సేద తీరుతున్న వార్న్‌కు తీవ్ర గుండెపోటు వచ్చింది. వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. వార్న్ ఆకస్మిక మృతి క్రికెట్ ప్రపంచాన్ని షాక్‌కు గురి చేసింది. ప్రపంచ క్రికెట్‌లోని అత్యుత్తమ ఆటగాళ్లలో షేన్ వార్న్ ఒకడిగా పేరు తెచ్చుకున్నాడు. టెస్టులు, వన్డే క్రికెట్‌లో అగ్రశ్రేణి బౌలర్‌గా వెలుగొందాడు. సుదీర్ఘ కెరీర్‌లో ఎన్నో చిరస్మరణీయ విజయాలను ఆస్ట్రేలియాకు సాధించి పెట్టాడు. టెస్టు క్రికెట్‌లో అత్యధిక వికెట్లు పడగొట్టిన రెండో బౌలర్‌గా షేన్ వార్న్ నిలిచాడు. 145 టెస్టుల్లో ఆస్ట్రేలియాకు ప్రాతినిథ్యం వహించిన వార్న్ రికార్డు స్థాయిలో 708 వికెట్లు పడగొట్టాడు. ఈ క్రమంలో శ్రీలంక దిగ్గజం ముత్తయ్య మురళీధరన్ తర్వాత టెస్టు క్రికెట్‌లో అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా షేన్ వార్న్ రికార్డు సాధించాడు. దీంతో పాటు వార్న్ 194 వన్డేలు ఆడిన 293 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. అంతేగాక ఐపిఎల్‌పై కూడా షేన్ వార్న్ తనదైన ముద్ర వేశాడు. ఐపిఎల్ అరంగేట్రం సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరించి ఆ జట్టుకు ట్రోఫీని సాధించి పెట్టాడు. తన స్పిన్ బౌలింగ్‌తో ప్రపంచ క్రికెట్‌లోని అత్యుత్తమ బ్యాట్స్‌మన్‌లకు సయితం చుక్కలు చూపించాడు. భారత క్రికెట్ దిగ్గజం సచిన్, గంగూలీ, లక్ష్మణ్, ద్రవిడ్, సెహ్వాగ్ తదితరులు కూడా వార్న్ బౌలింగ్‌ను ఎదుర్కొవడంలో ఇబ్బందులు పడ్డారు. ఈ విషయాన్ని ఈ దిగ్గజాలే పలు సందర్భాల్లో వెల్లడించారు.


అరుదైన క్రికెటర్..
ప్రపంచ క్రికెట్ దిగ్గజాల్లో షేన్ వార్న్ ఒకడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆస్ట్రేలియాకు లభించిన ఆణిముత్యాల్లో షేన్ వార్న్‌దే అగ్రస్థానం. అద్భుత బౌలింగ్‌తో ఆస్ట్రేలియాను బలమైన జట్టుగా మార్చడంలో షేన్ వార్న్ పాత్ర చాలా కీలకం. అసాధారన బౌలింగ్‌తో ఆస్ట్రేలియా క్రికెట్‌కు ఎన్నో చారిత్రక విజయాలు అందించాడు. వరుస ఓటములతో సతమతమయ్యే ఆస్ట్రేలియా బలమైన జట్టుగా ఎదిగిందంటే దానికి షేన్ వార్న్ బౌలింగ్ ప్రతిభ కూడా చాలా కీలకం. ఒత్తిడిలోనూ అద్భుత బౌలింగ్‌ను కనబరచడం వార్న్‌కు వెన్నతో పెట్టిన విద్యగా ఉండేది. చిరకాల ప్రత్యర్థులు ముత్తయ్య మురళీధరన్, అనిల్ కుంబ్లే, సక్లయిన్ ముస్తాక్, వెటోరి, ముస్తాక్ అహ్మద్, హర్భజన్ తదితరులతో పోటీ పడి వార్న్ వికెట్ల పంట పండించే వాడు. ప్రపంచ క్రికెట్‌లోని అత్యుత్తమ స్పిన్నర్లలో వార్న్ కూడా ఒకడు. మురళీధరన్ తర్వాత టెస్టుల్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన రికార్డు వార్న్‌దే. ఈ క్రమంలో వార్న్ భారత దిగ్గజం అనిల్ కుంబ్లేను సయితం వెనక్కినెట్టి రెండో స్థానాన్ని దక్కించుకున్నాడు. రానున్న రోజుల్లో వార్న్ రికార్డును అందుకోవడం ఒక్క రవిచంద్రన్ అశ్విన్‌కు మాత్రమే సాధ్యమయ్యే అవకాశాలున్నాయి. అది కూడా అశ్విన్ పూర్తి ఫిట్‌నెస్‌తో మరి కొన్నేళ్లపాటు క్రికెట్‌లో కొనసాగితేనే.


ప్రస్థానం..
షేన్ వార్న్ సెప్టెంబర్ 13, 1969లో ఆస్ట్రేలియాలోని విక్టోరియాలో జన్మించాడు. 1992లో సిడ్నీ వేదికగా భారత్‌తో జరిగిన మ్యాచ్ ద్వారా వార్న్ తన టెస్టు క్రికెట్ ప్రస్థానాన్ని ప్రారంభించాడు. ఇక తన చివరి టెస్టును జనవరి 2007లో సిడ్నీ వేదికగా ఇంగ్లండ్‌పై ఆడాడు. ఇక తొలి వన్డే 1993 మార్చి 24 వెల్లింగ్టన్‌లో న్యూజిలాండ్‌తో ఆడాడు. ఇక తన చివరి అంతర్జాతీయ వన్డే మ్యాచ్‌ను మెల్‌బోర్న్‌లో ఐసిసి వరల్ల్ ఎలెవన్ తరఫున ఆడాడు. మరోవైపు 145 టెస్టులు ఆడిన వార్న్ 708 వికెట్లు పడగొట్టాడు. ఈ క్రమంలో 37 సార్లు ఐదు అంతకంటే ఎక్కువ వికెట్లు తీశాడు. దీంతోపాటు పది సార్లు పది అంతకంటే ఎక్కువ వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. టెస్టు క్రికెట్‌లో ఇవి కూడా అరుదైన రికార్డులుగా నిలిచి పోయాయి. వన్డేల్లో కూడా వార్న్ 293 వికెట్లు తీశాడు. కెరీర్‌లో వార్న్ 194 వన్డేలు ఆడాడు.

Australia Legend Shane Warne Passes away
ప్రముఖుల సంతాపం..
క్రికెట్ లెజెండ్ షేన్ వార్న్ మృతిపై ప్రపంచ వ్యాప్తంగా సంతాపాలు వెల్లువెత్తాయి. ఐసిసి, బిసిసిఐ, క్రికెట్ ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ అండ్ వెల్స్ క్రికెట్ బోర్డులతో పాటు పలు దేశాల క్రికెట్ సంఘాలు వార్న్ మృతిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశాయి. వార్న్ మృతి ప్రపంచ క్రికెట్‌కు తీరని లోటని అవి తమ సంతాప సందేశంలో పేర్కొన్నాయి. ఇక భారత క్రికెట్ దిగ్గజాలు సునీల్ గవాస్కర్, కపిల్ దేవ్, అజారుద్దీన్, రవిశాస్త్రి, సచిన్, గంగూలీ, సెహ్వాగ్, ద్రవిడ్, కోహ్లి, కుంబ్లే, హర్భజన్, రోహిత్, లక్ష్మణ్ తదితరులు కూడా వార్న్ మృతిపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. వార్న్ ప్రపంచ క్రికెట్‌కు లభించిన అరుదైన క్రికెటర్‌గా వారు అభివర్ణించారు. మరోవైపు తెలంగాణ మంత్రులు కెటిఆర్, శ్రీనివాస్ గౌడ్ తదితరులు కూడా వార్న్ మృతి పట్ల తీవ్ర సంతాపం తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News