Monday, December 23, 2024

తృటిలో ఆరోగ్య సమాచారం

- Advertisement -
- Advertisement -

KTR Launched Digital Health Profile Pilot Project

ప్రతి ఒక్కరి ఆరోగ్య వివరాలు డిజిటలైజ్ చేసి పొందుపర్చడానికి ‘హెల్త్ ప్రొఫైల్’
వేములవాడలో మంత్రి కెటిఆర్, ములుగులో మంత్రి హరీశ్‌రావు చేతులమీదుగా ప్రారంభం

మన తెలంగాణ/వేములవాడ/ములుగు ప్రతినిధి: ప్రతి ఒక్కరి ఆరోగ్య సమాచారం డిజిటలైజేషన్ చేసి, సమగ్రంగా పొందుపరచడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయోగాత్మకంగా హెల్త్ ప్రొఫైల్ డిజిటలైజేషన్‌ను శ్రీకారం చుట్టింది. సుమారు రూ.42కోట్ల వ్యయంతో ఫైలట్ ప్రాజెక్ట్‌గా ఈ పథకాన్ని వేములవాడలో మంత్రి కె తారక రామారావు, ములుగులో మంత్రి హరీశ్ రావులు శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ.. దేశంలో ఈ విధమైన కార్యక్రమం ఎక్కడ జరగలేదని, యూరోప్‌లో ఉందని, ఇప్పడు మన రాష్ట్రంలో రాజన్న సిరిసిల్ల, ములుగు జిల్లాల్లో ప్రారంభమైందన్నారు. ఆరోగ్య తెలంగాణను ఆవిష్కరించేందుకు సిఎం కెసిఆర్ దీన్ని చేపట్టారని, హెల్త్ ప్రొఫైల్ కార్యక్రమంలో భాగంగా ఇక్కడి ప్రజలు అందరికి డిజిటల్ హెల్త్ కార్డులు ఇస్తామన్నారు. 18 ఏళ్లు నిండిన ప్రతి వ్యక్తి రక్త నమూనాలను సేకరించి, పరీక్షల నిర్థారణ కేంద్రానికి పంపడం జరుగుతుందని, ల్యాబ్‌లో నమూనాలను పరీక్షించిన వారి పూర్తి ఆరోగ్య వివరాలను ఆన్‌లైన్‌లో భద్రపరచి, ఆరోగ్య సమస్యలు, వివరాలను తెలిపేందుకు డిజిటల్ కార్డును అందజేయడం జరుగుతుందన్నారు. అవసరమైన నిర్దారణ పరీల పరికరాలు, ఇతర వస్తువుల కొనుగోలుకు తొలివిడతగా రూ.9.16 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. వైద్య బృందాలు ప్రతి ఇంటికి తిరిగి పరీక్షలు చేస్తామని, ఒక్కో బృందం రోజుకు 40మంది వ్యక్తుల నుంచి రక్త నమూనాలు సేకరిస్తారన్నారు. ఒక్కో బృందంలో ఇద్దరు ఆశాలు, ఒక ఎఎన్‌ఎం ఉండి, పరీక్షలు చేస్తారన్నారు. రాబోయే 60రోజుల్లో ఇంటింటికి ఆరోగ్య కార్యకర్తలు తిరిగి నమూనాలు సేకరిస్తారన్నారు.
భవిష్యత్‌లో అనారోగ్యంతో ఆసుపత్రికి వెళ్లే.. ఈ కార్డు ద్వారా మన ఆరోగ్య సమస్యలు తెలుసుకుని వైద్య సేవలు అందించడానికి అనువుగా ఉంటుందన్నారు. హెల్త్ రికార్డు తయారు చేయడం ద్వారా వ్యక్తి అపస్మారక స్థితిలోకి వెళ్లినప్పుడు మళ్లీ కొత్తగా ఆసుపత్రిలో అన్నిరకాల పరీక్షలు చేయడం ఉండదని, దీనివల్ల సమయం ఆదా అయి, విలువైన ప్రాణాలను కాపాడే ఆస్కారం ఉంటుందన్నారు. ఈ రెండు జిల్లాల్లో పైలెట్ ప్రాజెక్టు పూర్తయిన తరువాత రాష్ట్రంలో మిగిలిన జిల్లాల్లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి అందరికి డిజిటల్ హెల్త్‌కార్డులను అందజేయడం జరుగుతుందని మంత్రులు తెలిపారు. ములుగు కలెక్టరేట్‌లో జరిగిన కార్యక్రమంలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, ఎంపి కవిత, ఎంఎల్‌ఎ సీతక్క, ఎంఎల్‌సిలు బస్వరాజు సారయ్య, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, ఎంఎల్‌ఎలు అరూరి రమేష్, టిఎస్‌ఎంఐడిసి చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, జడ్పి చైరపర్సన్లు కుసుమ జగదీశ్వర్, గండ్ర జ్యోతి, ఆరోగ్య శాఖ డైరెక్టర్ శ్రీనివాస్, కలెక్టర్ కృష్ణ ఆదిత్య, అదనపు కలెక్టర్ త్రిపాఠీ, వికలాంగుల సహకార సంస్థ చైర్మన్ వాసుదేవ రెడ్డి, డిసిసిబి చైర్మన్ మార్నేని రవీందర్ రావు, మాజీ ఎంపి సీతారాం నాయక్ పాల్గొనగా, వేములవాడలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే రమేష్ బాబు, జడ్పీ చైర్‌పర్సన్ అరుణ రాఘవరెడ్డి, ఎంఎల్‌సి కూర రఘోత్తంరెడ్డి, డిఆర్‌వో టి. శ్రీనివాస్ రావు, ఆర్డీవో లీల, జిల్లా వైద్యాధికారి డా. సుమన్‌మోహన్ రావు, మున్సిపల్ చైర్‌పర్సన్లు జిందం కళా, రామతీర్థపు మాధవి, మున్సిపల్ కమిషనర్లు సమ్మయ్య, శ్యాం సుందర్ రావు, ఆసుపత్రుల పర్యవేక్షకులు డా. మురళీధర్ రావు, డా. మహేష్ రావు, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

KTR Launched Digital Health Profile Pilot Project

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News