Monday, December 23, 2024

రేపు సిఎం కెసిఆర్‌ను కలుస్తా: జగ్గారెడ్డి

- Advertisement -
- Advertisement -

Congress MLA Jaggareddy to meet CM KCR

హైదరాబాద్: టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్, సంగారెడ్డి ఎంఎల్‌ఎ తూర్పు జయప్రకాశ్‌రెడ్డి (జగ్గారెడ్డి) బుధవారం కీలక ప్రకటన చేశారు. తెలంగాణ సిఎం కెసిఆర్ అపాయింట్‌మెంట్ కోరతానని ఆయన వెల్లడించారు. గురువారమే కెసిఆర్‌ను కలిసేందుకు యత్నిస్తానని జగ్గారెడ్డి చెప్పారు. ఇప్పటికే టిపిసిసి చీఫ్ రేవంత్‌రెడ్డిపై ఆగ్రహాంతో ఉన్న జగ్గారెడ్డి పార్టీకి రాజీనామా చేస్తానని ఓ సంచలన ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా సిఎం కెసిఆర్‌ను కలిసేందుకు అపాయింట్‌మెంట్‌ను కోరతానని జగ్గారెడ్డి ప్రకటించడంతో మరోమారు ఆయన వార్తల్లో వ్యక్తిగా నిలిచారు. బుధవారం నాడు అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఖాళీ ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లుగా సిఎం కెసిఆర్ ప్రకటించిన సంగతి విదితమే.

ఆ తర్వాత అసెంబ్లీ బయటకు వచ్చిన జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలని తమ పార్టీ తరపున ఎన్నో ఉద్యమాలు చేశామని ఆయన చెప్పారు. ఆ డిమాండ్ మేరకు ఇప్పుడు భారీ ఎత్తున ఉద్యోగాల భర్తీ చేపడుతున్నందుకు కెసిఆర్‌కు కృతజ్ఞతలు తెలిపేందుకే ఆయన అపాయింట్‌మెంట్ కోరనున్నట్లుగా జగ్గారెడ్డి చెప్పారు. సొంత స్థలం ఉండి ఇల్లు కట్టుకోవాలనుకునేవారికి రూ.3 లక్షలు ఇవ్వనున్నట్లుగా ప్రకటించిన కెసిఆర్ సర్కార్ నిర్ణయాన్ని కూడా జగ్గారెడ్డి కీర్తించారు. కాగా బిస్వాల్ కమిటీ నివేదిక ప్రకారం మిగతా పోస్టుల భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో తమ కాంగ్రెస్ పార్టీలో భిన్నాభిప్రాయాలు లేవని జగ్గారెడ్డి చెప్పుకొచ్చారు. ఏడేళ్లుగా నోటిఫికేషన్లు ఇవ్వట్లేదని పలుమార్లు ప్రభుత్వాన్ని విమర్శించానని చెప్పారు. ఏ పార్టీ అయినా రాజకీయ లబ్ది లేకుండా పనిచేయదని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News