న్యూఢిల్లీ : ప్రభుత్వ మిగులు భూములు, భవనాల స్వాధీనం నిర్వహణ, వాటిద్వారా ఆదాయవనరుల ఏర్పాటు ( మానిటైజ్)పై కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. సంబంధిత మానిటైజేషన్ ప్రక్రియకు ఓ కొత్త కంపెనీని నేషనల్ ల్యాండ్ మానిటైజేషన్ కార్పొరేషన్ ( ఎన్‌ఎల్‌ఎంసి) పేరిట ఏర్పాటు చేసే నిర్ణయానికి కేంద్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. కేబినెట్ భేటీ బుధవారం జరిగింది. ఈ కంపెనీ స్పెషల్ పర్పస్ వెహికల్ (ఎస్‌పివి)గా వ్యవహరిస్తుంది. దీనికి ఆరంభ షేర్ క్యాపిటల్‌ను రూ 5000 కోట్లుగా ఖరారు చేశారు. పెయిడ్ అప్ షేర్ క్యాపిటల్‌గా రూ 150 కోట్లను కేటాయించారు. ప్రభుత్వ భూములు, భవనాలు, ప్రభుత్వ రంగ సంస్థల మిగులు స్థిరాస్తుల విక్రయ వ్యవహారాలు వాటి నిర్వహణను సంబంధిత కంపెనీ పర్యవేక్షిస్తుందని కేబినెట్ భేటీ తరువాత అధికారులు తెలిపారు.
వినియోగంలో లేని ప్రభుత్వ ఆస్తులను విక్రయించడం ద్వారా అవసరం అయిన ఆర్థిక వనరులను సమకూర్చుకోవడానికి ఈ కంపెనీ చర్యలు తీసుకుంటుంది. వినియోగంలో లేకుండా ఉన్న భూములను, భవనాలను విక్రయించడం ప్రైవేటుకు అప్పగించడం వాటి పెట్టుబడులకు వీలు కల్పించడం కీలక పరిణామం అవుతుంది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు (సిపిఎస్‌యు) ఆధీనంలో ఇప్పటికే 3500 ఎకరాల మిగులు భూములు ఉన్నట్లు లెక్కలలో తేలింది. వీటి నిర్వహణ లేదా వీటిని కొనుగోలు చేసేందుకు ప్రైవేటు సంస్థలను గుర్తించేందుకు సంబంధిత సంస్థ ఏర్పాట్లు చేసుకుంటుంది.