షెడ్యూల్ జారీ … ఎప్రిల్ 26న ఎగ్జామ్స్
న్యూఢిల్లీ : సిబిఎస్‌ఇ బోర్డు 10, 12 తరగతుల టర్మ్ 2 పరీక్షలు వచ్చే నెల 26 నుంచి ఆరంభం అవుతాయి. సంబంధిత పరీక్షల నిర్వహణ బాధ్యత వహించే సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకెండరీ ఎడ్యుకేషన్ (సిబిఎస్‌ఇ) శుక్రవారం ఈ పరీక్షల షెడ్యూల్‌ను వెలువరించింది. గత ఏడాది సిబిఎస్‌ఇ తరఫున రెండు టర్మ్‌ల పరీక్షలకు ప్రకటన వెలువరించింది. దీనిమేరకు టర్మ్ 1 పరీక్షలు ఇప్పటికే ముగిశాయి. ఇప్పుడు ఎప్రిల్ 26 నుంచి 10, 12 తరగతులకు మిగిలిన టర్మ్ పరీక్షలు నిర్వహిస్తారు. కరోనా పరిస్థితిని పరిగణనలోకి తీసుకుని తాము రెండు టర్మ్‌ల పరీక్షలకు మధ్య సరైన గడువు కల్పించామని సిబిఎస్‌ఇ తమ ప్రకటనలో తెలిపింది. పలు ప్రాంతాలలో కొవిడ్ తీవ్రత లాక్‌డౌన్ వంటి పరిణామాలతో స్కూళ్లు చాలాకాలం మూతపడ్డాయి. దీనిని తగు విధంగా పరిగణనలోకి తీసుకుని ఇప్పుడు తగు విరామం తరువాత పరీక్షలను ఖరారు చేసినట్లు ప్రకటనలో వివరించారు. జెఇఇ మొయిన్ వంటి ఇతర పోటీ పరీక్షల షెడ్యూల్‌ను పరిగణనలోకి తీసుకుని ఇప్పుడు ఈ పరీక్షలను ఖరారు చేశారు.