చర్చ లేకుండానే సమావేశం వాయిదా
హైదరాబాద్: గోదావరి నదీయాజమాన్య బోర్డు సమావేశానికి ఎపికి చెందిన నీటిపారుదల శాఖ అధికారులు గైర్హాజరయ్యారు. శుక్రవారం జలసౌధలో బోర్డు చైర్మన్ ఎంపి సింగ్ అధ్యక్షతన ప్రారంభమైన ఈ సమావేశంలో తెలంగాణ రాష్ట్రం నుంచి నీటిపారుదల శాఖ స్పెషల్ సిఎస్ రజత్ కుమార్, ఈఎన్సీ మురళీధర్ హాజరయ్యారు. ఎంతోసేపు ఎదురు చూసినప్పటికీ ఎపి అధికారులు ఎవరూ సమావేశాకిని రాలేదు. ఈ సందర్బంగా స్సెషల్ సిఎస్ రజత్ కుమార్ మాట్లాడుతూ చైర్మన్‌కు సమాచారం ఇవ్వకుండా ఎపి అధికారులు గైర్హాజరు కావడం పట్ల అసంతృప్తిని వ్యక్తం చేశారు. భవిష్యత్‌లో బోర్డు సమావేశాలు నిర్వహించేముందు సభ్యుల భాగస్వామ్యాన్ని నిర్ధారించాలని గోదావరి బోర్డు చైర్మన్ ఎంపి సింగ్‌కు సూచించారు. సమావేశాన్ని రెండు రాష్ట్రాల అధికారులకు అనుకూలంగా ఉన్న సమయంలోనే నిర్వహించాలని నిర్ణయించినట్టు చైర్మన్ ఎంపి సింగ్ ప్రకటించారు.ఎటు వంటి చర్చలేకుండానే సమావేశాన్ని ముగించారు. ఈ సమావేశంలో బోర్డు సభ్యకార్యదర్శి బిపి పాండ్య, సభ్యలు కుటియాల్ , కమిటి సభ్యుడు శ్రీధర్ రావు దేశ్ పాండే ,అదిలాబాద్ సిఈ శ్రీనివాసరెడ్డి. నిజామాబాద్ సిఈ మధుసూధన్ రావు, ఇంటర్‌స్టేట్ సిఈ మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు.