న్యూఢిల్లీ : ఉత్తరాఖండ్ ఎన్నికల తాజా విజేతల జాబితాలో 27 శాతం మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయి. తమపై కేసులు ఉన్నట్లు ఈ అభ్యర్థులే స్వయంగా తమ అఫిడవిట్లలో తెలియచేసుకున్నారు. ఈ విషయాన్ని ఎన్నికల సంస్కరణల సలహాల సిఫార్సుల వేదిక అయిన ఎడిఆర్ ఇప్పుడు వెల్లడించింది. ఉత్తరాఖండ్‌లో ఇప్పుడు విజేతలైన 70 మంది ఎన్నికల నామినేషన్ల సమయంలో దాఖలు చేసిన పత్రాలను ప్రజాస్వామిక సంస్కరణల వేదిక అయిన ఎడిఆర్ ఇప్పుడు తెలిపింది. గెలిచిన వారిలో పది మందిపై తీవ్రస్థాయి క్రిమినల్ కేసులున్నాయి. ఈ విధంగా ఇటువంటి ఘాటు రకం నేతలు గెలిచిన వారిలో పది శాతం మంది వరకూ ఉన్నట్లు స్పష్టం అయింది. ఇక పార్టీల వారిగా చూస్తే బిజెపిలో ఎనమండుగురు ( 17 శాతం), కాంగ్రెస్‌లో ఎనమండుగురు (42 శాతం) బిఎస్‌పిలో ఒకరు ఉన్నారు.
ఇక్కడ గెలిచింది ఇద్దరు బిఎస్‌పి అభ్యర్థులే. వీరిలో ఒక్కరికి నేర చరిత్ర ఉంది. ఇక బిజెపి విజేతలలో 11 శాతం మందిపై, కాంగ్రెస్ తరఫు వారిలో 21 శాతం మందిపై తీవ్రస్థాయి కేసులు ఉన్నాయి. ఇక విజేతలలో కోటీశ్వరులు 58 మంది వరకూ ఉన్నారు. ఈ విధంగా కోటీశ్వరులు 83 శాతం వరకూ నమోదయ్యారు. వీరిలో బిజెపి కాంగ్రెస్‌లు పోటాపోటీగా ఉన్నారు. బిజెపిలో 40 మంది కోటీశ్వరులు ఉన్నారు. కాంగ్రెస్ నుంచి 15 మంది కోటీశ్వరులు ఎన్నికయిన వారిలో ఉన్నారని వెల్లడైంది.